International Men's Day 2026
* “ది ఫ్యూచర్ ఈజ్ ఎవ్రీవన్” నినాదంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
ఆకేరు న్యూస్ , నెట్వర్క్:
ఇంటి గడప దాటినప్పటి నుంచి తిరిగి వచ్చేవరకు మగవాడి జీవితంలో ఎన్నో బాధ్యతలు, మరెన్నో నిశ్శబ్ద త్యాగాలు దాగి ఉంటాయి. తన కళ్లలో నీళ్లు వచ్చినా పెదవులపై నవ్వును దాచుకుంటూ, కుటుంబానికి ఆసరాగా, సమాజానికి అండగా, దేశ భద్రతకు కవచంగా నిలుస్తున్న పురుషుడి శ్రమను గుర్తుచేసుకునే రోజు నేడు. ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men’s Day) సందర్భాన్ని పురస్కరించుకుని పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు, చర్చా వేదికలు జరుగుతున్నాయి. 1999లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో డాక్టర్ జెరోమ్ టీలుక్సింగ్ ప్రారంభించిన ఈ దినోత్సవం, మన దేశంలో 2007 నుంచి క్రమంగా విస్తరిస్తోంది.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 19న ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మెన్ అండ్ బాయ్స్’ (ICMB) తొలి ‘గ్లోబల్ స్టేట్ ఆఫ్ మెన్ అండ్ బాయ్స్ రిపోర్ట్ 2026’ను విడుదల చేసింది. 50కి పైగా దేశాల ఆధారాలు, అంతర్జాతీయ సంస్థల పరిశోధనలతో పురుషులు, బాలురు ఎదుర్కొంటున్న 12 ప్రధాన అసమానతలను ఈ నివేదిక విశ్లేషించింది.
రేపటి భవిష్యత్తు ఒక్కరిదో కాదని, స్త్రీ, పురుషులనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి శ్రమ, ఆలోచన, శ్రేయస్సు కలిసినప్పుడే బలమైన సమాజం ఏర్పడుతుందనే భావనను ఈ నినాదం బలంగా వినిపిస్తోంది.
* నిపుణుల హెచ్చరిక
మగాడికి కష్టాలు ఉండకూడదు.. బాధ చెప్పుకోకూడదు అనే పాతకాలపు ఆలోచనలు పురుషులను మానసికంగా కుంగదీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక భారం, పని ఒత్తిడి, కుటుంబ ఆశల మధ్య నలిగిపోతూ చాలామంది తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా మానసిక ఒత్తిడిని బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు, ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఆరోగ్య తనిఖీలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఏడాదిలో ఒక్క రోజు గుర్తుచేసుకోవడంతో సరిపెట్టకుండా, ప్రతి రోజూ మన చుట్టూ ఉన్న పురుషుల శ్రమను, వారి ఆరోగ్యాన్ని, భావోద్వేగాలను గౌరవించడమే ఈ రోజుకు నిజమైన అర్థమని సామాజిక పరిశీలకులు పేర్కొంటున్నారు.
Also Read: స్నాప్‌చాట్ వేదికగా డ్రగ్స్ దందా..

Please tell us what is wrong. Your report will be sent to the website team.

