తెలంగాణలో 83 ఉద్యోగాలకు నోటిఫికేషన్
* దివ్యాంగులకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల
* జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ సహా పలు పోస్టుల భర్తీ
* డిసెంబర్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల (Telangana Jobs 2026) కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలో ఖాళీగా ఉన్న 83 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టింది.
ఈ మేరకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం 2025-26 ప్రత్యేక నియామక డ్రైవ్ కింద నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన బెంచ్‌మార్క్ దివ్యాంగులు (PwBD) మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* మొత్తం 83 పోస్టులు.. ఏయే ఉద్యోగాలు ఉన్నాయంటే?
ఈ నియామకాల్లో గ్రూప్-IV కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 3 ఉండగా, క్లాస్-IV కేటగిరీలో 80 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారీగా చూస్తే జూనియర్ అసిస్టెంట్ 3, లైబ్రేరియన్ గ్రేడ్-III ఒకటి, ల్యాబ్ అటెండర్ ఒకటి, ఆఫీస్ సబార్డినేట్ 16, వాచ్మెన్ 8, గేట్ పోర్టర్ 4, కమటి 8, అసిస్టెంట్ ధోబీ 4, స్వీపర్ 11, మాలి 11, తొట్టి 9, స్కావెంజర్ 2, కుక్ ఒకటి, ఆయా ఒకటి, ఫిమేల్ వార్డ్ అటెండెంట్ ఒకటి, జూనియర్ లిఫ్ట్ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నాయి.
* పోస్టుల వారీగా విద్యార్హతలు..
జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఆఫీస్ ఆటోమేషన్‌పై ప్రావీణ్యం తప్పనిసరి.
లైబ్రేరియన్ గ్రేడ్-III పోస్టుకు ఇంటర్మీడియట్‌తో పాటు లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి, ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణత అవసరం. వాచ్మెన్, గేట్ పోర్టర్ పోస్టులకు ఐదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మిగిలిన క్లాస్-IV పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో చదవడం, రాయడం తెలిసి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసే పోస్టుకు సంబంధించిన నిర్దిష్ట విద్యార్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
* దివ్యాంగులకు ఉండాల్సిన అర్హతలు
ఈ ఉద్యోగాలు బెంచ్‌మార్క్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టులు కావడంతో నిర్దేశిత వైకల్య శాతం కలిగి ఉండాలి. సాధారణంగా కనీసం 40 శాతం బెంచ్‌మార్క్ వైకల్యం ఉండాలి. వినికిడి లోపం (HI) కేటగిరీ అభ్యర్థులకు కనీసం 75 శాతం వైకల్యం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
దృష్టి లోపం (VI), వినికిడి లోపం (HI), లోకోమోటర్ వైకల్యం (LD), మేధోపరమైన వైకల్యాలు (ID) తదితర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి. సంబంధిత అధికారులచే జారీ చేసిన చెల్లుబాటు అయ్యే దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం లేదా SADAREM సర్టిఫికెట్, UDID కార్డు సమర్పించాలి. తాత్కాలిక దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలను అర్హతకు పరిగణనలోకి తీసుకోరు.
* హైదరాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థులకే అవకాశం
ఈ నియామకాలు హైదరాబాద్ జిల్లా స్థానిక కేడర్‌కు సంబంధించినవి. కాబట్టి హైదరాబాద్ జిల్లాకు చెందిన అర్హులైన స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్థానికతను నిరూపించేందుకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు లేదా నిబంధనలకు అనుగుణంగా రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించాలి. తల్లిదండ్రుల స్థానికతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అవసరమైన సందర్భాల్లో జతచేయాలి.
* వయోపరిమితి, జీతభత్యాలు
అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 54 సంవత్సరాలుగా నిర్ణయించారు. 2026 జూలై 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సును లెక్కిస్తారు. ఎంపికైన వారికి పోస్టులను బట్టి PRC-2020 పే స్కేల్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు.
* ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అలాగే కంప్యూటర్ వినియోగం, ఆఫీస్ ఆటోమేషన్‌పై అభ్యర్థుల ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. ఈ పోస్టులకు రాత పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూ ఉండవు.
క్లాస్-IV పోస్టులకు మొత్తం 50 మార్కుల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థుల వయస్సుకు 15 మార్కులు, దివ్యాంగతకు 30 మార్కులు, మల్టిపుల్ డిజేబిలిటీకి 5 మార్కులు కేటాయించారు. ప్రాథమిక విద్యార్హతకు ప్రత్యేక మార్కులు కేటాయించకపోయినా, సంబంధిత పోస్టుకు నిర్దేశించిన విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి.
* దరఖాస్తు చేసుకునే విధానం..
ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు హైదరాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయాలి. దరఖాస్తును స్పష్టంగా టైప్ చేసి లేదా తెల్ల కాగితంపై రాసి సమర్పించవచ్చు. దరఖాస్తుకు పాస్‌పోర్ట్ సైజు ఫొటో అతికించడంతో పాటు మరో ఫొటోను జతచేయాలి.
రెండు ఫొటోలపై అభ్యర్థి సంతకం చేయాలి. విద్యార్హతలు, దివ్యాంగత, స్థానికత, వయస్సు తదితరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేయించాలి. ఒక్కో పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు సమర్పించాలి. పూర్తి చేసిన దరఖాస్తులను స్వయంగా లేదా అధీకృత వ్యక్తి ద్వారా సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
* దరఖాస్తు పంపాల్సిన చిరునామా
అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ, గ్రౌండ్ ఫ్లోర్, బ్లాక్ M4, మనోరంజన్ కాంప్లెక్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో, అజంతా గేట్, ఎం.జె. రోడ్, నాంపల్లి, హైదరాబాద్ – 500001.
* దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు
దరఖాస్తుతో పాటు SADAREM సర్టిఫికెట్ లేదా UDID కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కంప్యూటర్ సర్టిఫికెట్, స్థానికత లేదా రెసిడెన్షియల్ సర్టిఫికెట్, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జతచేయాలి.
* ముఖ్యమైన తేదీలు, వివరాలు..
దరఖాస్తులు 18-12-2026 రోజు నుండి 02-12-2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరించబడుతాయి.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9640452773.
అధికారిక వెబ్సైట్: www.hyderabad.telangana.gov.in
హైదరాబాద్ జిల్లాకు చెందిన (Telangana Jobs 2026) అర్హులైన దివ్యాంగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, పోస్టుల వారీగా విద్యార్హతలు, దివ్యాంగత కేటగిరీలు, స్థానికత నిబంధనలు తెలుసుకోవాలి.
అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులు, చివరి తేదీ తర్వాత అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకొని డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలి.
Read Also : ఓఎన్జీసీలో 3,047 అప్రెంటిస్ పోస్టులు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

