ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
* ఇందిరమ్మ కొత్త పథకం ప్రారంభం
* నవంబర్ 26 నుంచి కోటి చీరల పంపిణీ
* కోటి మందికి కోటి చీరలు
* సిద్దిపేటలో సీఎం కీలక ప్రకటనలు
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సిద్దిపేటలో జరిగిన ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలో ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసి ముస్తాబాద్ చౌరస్తా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని CM Revanth Reddy ప్రారంభించారు.
రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. నవంబర్ 26 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మహిళలకు గౌరవం, ప్రాధాన్యత కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
సిద్దిపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ నాయకుడు మదన్ మోహన్ తెలంగాణ తొలి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని సీఎం గుర్తుచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ మెడికల్ కాలేజీగా పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి వెంటనే అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.

* మల్లన్నసాగర్ నిర్వాసితులకు భరోసా..
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురైన 14 గ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. నిజమైన లబ్ధిదారులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే అధికారులు గ్రామాల్లోని ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించిన తర్వాత నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నీటిలో ఒక్క చుక్కను కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గత పదేళ్లలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, సీతారామసాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం నీటి సమస్యలు ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.
* పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ కార్యక్రమాలు..
1983 నుంచి 2023 వరకు వివిధ ప్రభుత్వాల హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ తమ ప్రభుత్వం రద్దు చేయలేదని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో అమలైన పథకాలను మరింత మెరుగుపరచడంతో పాటు కొత్త సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రారంభించామని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించడం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో 50 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, కొత్తగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం చెప్పారు. రుణమాఫీతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో రైతుల కోసం మొత్తం రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గుర్తుచేశారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి. సుదర్శన్ రెడ్డి, వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.
Also Read : సిద్దిపేటలో సీఎం ప్రసంగంపై హరీశ్‌రావు ఫైర్
Please tell us what is wrong. Your report will be sent to the website team.

