Perumandla Ramakrishna
* కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత సవాల్!
* వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం..
* డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
ఆకేరు న్యూస్, హనుమకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దమ్ముంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ సవాల్ విసిరారు. సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ అభివృద్ధిపై కేటీఆర్‌తో బహిరంగ చర్చకు (Open Debate) తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
హనుమకొండలో మంగళవారం చోటుచేసుకున్న పరిణామాలపై డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. అభివృద్ధిపై చర్చకు సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేతలు, తాము డీసీసీ భవన్ నుంచి చౌరస్తాకు చేరుకున్నప్పటికీ చర్చకు రాకుండా ముఖం చాటేశారని ఆరోపించారు. పైగా తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తుంటే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఆధారాలు లేని విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
గత మూడేళ్లలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టారని రామకృష్ణ పేర్కొన్నారు. వరంగల్‌ను రెండో రాజధానిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి కేటీఆర్ అడ్డుపడ్డారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాస్, జక్కుల రవీందర్, బంక సరళ, ఆరూరి భీమగాని వినయ్, శ్వేత, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

