Chhattisgarh Literacy Survey
* చదవడం, రాయడం రాని వారిని గుర్తించనున్న ప్రభుత్వం!
* 15 ఏళ్లు పైబడిన వారికి 200 గంటల పాటు అక్షరాస్యత శిక్షణ
ఆకేరు న్యూస్, ఛత్తీస్‌గఢ్ : 2026-27లోగా సంపూర్ణ అక్షరాస్యత (Chhattisgarh Literacy Survey ) సాధించాలనే లక్ష్యంతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా చదవడం, రాయడం రాని వారిని గుర్తించేందుకు నవంబర్ 30 నుంచి ఇంటింటికీ సర్వే నిర్వహించనుంది. ‘మిషన్ ఉల్లాస్ 100’లో భాగంగా డిసెంబర్ 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. గ్రామాలు, పట్టణ వార్డుల్లో 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి వారికి ప్రాథమిక విద్య అందించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉల్లాస్ నవ భారత్ సాక్షరత కార్యక్రమం (Mission ULLAS) కింద అమలు చేయాలని రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథారిటీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో నిర్వహించిన అక్షరాస్యత కార్యక్రమాలకు దూరంగా ఉన్నవారిని కూడా ఈసారి గుర్తించనున్నారు. అయితే రాష్ట్రంలో ఇంకా ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారనే వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
* గత కార్యక్రమాలకు దూరమైన వారిపై ప్రత్యేక దృష్టి..
సర్వేలో భాగంగా ఓటరు జాబితాలు, రేషన్ కార్డులు, ఉపాధి హామీ పనుల మస్టర్ రోల్స్, గతంలో అక్షరాస్యత పరీక్షలకు హాజరుకాని లేదా ఉత్తీర్ణత సాధించని వారి రికార్డులను పరిశీలించనున్నారు. వీటి ఆధారంగా విద్యకు దూరంగా ఉన్నవారిని గుర్తిస్తారు. సాధారణ విద్యా కార్యక్రమాలు చేరుకోలేని వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
వలస కుటుంబాలు, ఇటుక బట్టీల్లో పనిచేసేవారు, నిర్మాణ రంగ కార్మికులు, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు, జైళ్లలో ఉన్న ఖైదీలు, మావోయిస్టు పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్నవారిని కూడా సర్వే పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమంలో 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొననున్నారు.
* ఒక్కొక్కరికి 200 గంటల శిక్షణ..
సర్వేలో గుర్తించిన నిరక్షరాస్యులను ఐదు నుంచి ఆరుగురు చొప్పున చిన్న బృందాలుగా ఏర్పాటు చేస్తారు. వారికి అనువైన ప్రదేశాలు, సమయాల్లో తరగతులు నిర్వహించనున్నారు. ఉల్లాస్ కేంద్రాల్లో ఒక్కొక్కరికి మొత్తం 200 గంటల పాటు శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులో (Chhattisgarh Literacy Survey) ప్రాథమిక చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానం వంటి అంశాలను (Literacy Training) బోధిస్తారు. అనంతరం 2027లో నిర్వహించే తదుపరి అక్షరాస్యత పరీక్షకు వారిని సిద్ధం చేస్తారు.
ఎన్సీసీ, స్కౌట్స్‌లోని విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తలు, గతంలో అక్షరాస్యత పరీక్షల్లో ఉత్తీర్ణులైన పెద్దలు బోధకులు, ప్రోత్సాహకులుగా వ్యవహరించనున్నారు. పాఠశాలల్లో బ్యాగ్‌లెస్ డేగా పాటించే శనివారాలను ఈ కార్యక్రమ ప్రచారానికి ఉపయోగించనున్నారు. వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో ఉల్లాస్ నినాదాలను గోడలపై రాయనున్నారు.
* గ్రామసభల్లో నిరక్షరాస్యుల జాబితాల ప్రకటన..
సర్వేలో అర్హులైన వారు ఎవరూ మిగిలిపోకుండా అధికారులు పలు దశల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. తొలిదశ సర్వేలో మిస్ అయిన ఇళ్లను డిసెంబర్ 25 వరకు మరోసారి సందర్శిస్తారు. గుర్తించిన వారి జాబితాలను గ్రామసభల్లో బహిరంగంగా చదివి వినిపిస్తారు.
డిసెంబర్ 25 నుంచి 31 మధ్య ప్రతి గ్రామం, పట్టణ వార్డులో 5 నుంచి 10 శాతం ఇళ్లను యాదృచ్ఛికంగా ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తారు. సర్వే వివరాలు ఎంతవరకు కచ్చితంగా ఉన్నాయో పరిశీలిస్తారు. డిసెంబర్ 31 నుంచి అక్షరాస్యత తరగతులు ప్రారంభించి, 2027లో జరిగే సామూహిక అక్షరాస్యత పరీక్ష వరకు కొనసాగించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.
కేవలం నిరక్షరాస్యులను గుర్తించడమే కాకుండా.. వారికి శిక్షణ అందించి, రోజువారీ జీవితంలో ఉపయోగపడే చదవడం, రాయడం, లెక్కల నైపుణ్యాలను నేర్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది.
Also Read : వరుస తుఫాన్ల దెబ్బ..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

