Telangana Deeksha Diwas
* ములుగులో ఘనంగా దీక్షా దివస్
ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు.
ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ (Deeksha Diwas) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పోరాటాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన కృషిని లక్ష్మణ్ బాబు గుర్తుచేసుకున్నారు.
కేసీఆర్ పోరాటం చిరస్మరణీయం
లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే దృఢ సంకల్పంతో ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరి పోసి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు కీలకంగా నిలిచారని కొనియాడారు.
కేసీఆర్ కేవలం తెలంగాణ రాష్ట్ర సాధనకే పరిమితం కాకుండా, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడని అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
ఉద్యమకారులకు ఘన సన్మానం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసిన ఉద్యమకారులను ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర సాధనలో వారి పాత్రను లక్ష్మణ్ బాబు ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు, మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, తాజా సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

