* ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని మోదీ
* ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
ఆకేరు న్యూస్ డెస్క్ : కేరళ (Kerala) లో మహా విషాదం చోటుచేసుకుంది. వయనాడ్ జిల్లా (Wayanad District) లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి (Landslides) దాదాపు 70 మంది దుర్మరణం చెందారు. శకలాలు తొలగించే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ ఉంటోంది. సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు. వందలాది మంది మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు, పోలీసులు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (Kerala State Disaster Management Force), అగ్నిమాపక బృందం (Fire Brigade), జాతీయ విపత్తు స్పందన దళాలు (National Disaster Response Force) ఘటానస్థలానికి చేరుకుని మట్టిదిబ్బలను తొలగొస్తున్నారు. ముండకైలో అర్ధరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడినట్లు (Landslides) స్థానికులు తెలిపారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లు పేర్కొన్నారు.
మెరుగైన వైద్యం : ప్రధాని మోదీ
ఈ ప్రమాద ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ (Kerala CM Pinarayi Vijayan) కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi Prime Minister) ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ (Modi) ఆదేశించారు. కేంద్రం తరఫున తగిన సహకారం ఉంటుందని తెలిపారు.
సీఎం, వయనాడ్ కలెక్టర్‌తో మాట్లాడిన రాహుల్
కొండచరియలు విరిగిపడి 36 మంది ప్రాణాలు కోల్పోవడంపై వయనాడ్ మాజీ ఎంపీ (Former Wayanad MP), ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Opposition Leader Rahul Gandhi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శిథిలాల కింద చిక్కుకొన్నవారిని త్వరలోనే సురక్షితంగా బయటకు తెస్తారని ఆశిస్తున్నట్లు ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ కలెక్టర్ (Wayanad Collector) తో మాట్లాడినట్లు రాహుల్ తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వారు తెలిపారన్నారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని కేరళ ప్రభుత్వాన్ని కోరినట్లు రాహుల్ పేర్కొన్నారు. ఏదైనా సాయం అవసరమైతే తమను సంప్రదించాలని సూచించారు.
——————–