* అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్
* మేనిఫెస్టోపై చురకలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి (Telangana Deputy Chief Minister), ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను (Finance Minister Bhatti Vikramarka) ఉద్దేశించి బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మున్ముందు పక్క కుర్చీలోకి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నా అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్(KTR) మాట్లాడారు. పదేళ్ల తర్వాత తెలంగాణ గురించి ప్రస్తావించే సందర్భంలో అధికార పార్టీ నేతలు గత ప్రభుత్వం.. గతం గతం అంటూ పురావస్తు శాఖ తవ్వినట్టు తవ్వుతూనే ఉన్నారని, తామూ తవ్వక తప్పదని తెలిపారు. ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఇలానే మరింత ఉన్నతిని సాధించాలని, భవిష్యత్‌లో పక్క (సీఎం) కుర్చీలోకి పోవాలని మనసారా కోరుకుంటున్నాను.. భట్టి విక్రమార్కకు ఆ అర్హత ఉందని కేటీఆర్ అన్నారు.
అరచేతిలో స్వర్గం.. మోచేతికి బెల్లం..
కాంగ్రెస్ పార్టీ (Congress Party) తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించిందని, బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Government) పై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (Sirisilla MLA KTR) నిప్పులు చెరిగారు. పదేళ్ల క్రితం తెలంగాణ వస్తే.. కరెంట్ ఉండదని, పెట్టుబడులు రావని భయాందోళనలు సృష్టించారని, ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు. సభకు ఇచ్చిన సోషియో ఎకానమిక్ అవుట్ లుక్‌లో తెలంగాణ గొప్ప రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. 2022 మార్చి 15న ఇదే సభలో ప్రతిపక్ష హోదాలో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ప్రతి సంవత్సరం సంపద సృష్టిస్తున్నారు. రాష్ట్రాన్ని కరోనా అతాలకుతలం చేసినప్పటికీ ఆ దాడిని తట్టుకోని ఉత్పత్తిని, సంపదను పెంచడం జరిగిందన్నారు. అక్కడ కూర్చోగానే స్వరం మారింది. అయినప్పటికీ వారు ఇచ్చిన అవుట్ లుక్‌లోనే అన్ని విషయాలు వివరంగా చెప్పారు. ఇందులో వాస్తవాలు బయటపడ్డాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు లేవు. నాలుగున్నరేండ్ల పాటు కలిసిమెలిసి పని చేసుకోవాలి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 3న చెప్పాం.. పదేండ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామన్నాం. ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే నిర్ణయాత్మక నిర్ణయాలకు సహకారం అందిస్తాం అని కేటీఆర్ తెలిపారు.
———————–