* ఒక్క సీటు కూడా తగ్గేదే లే
* గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి చంపారు
* వ్యవస్థ ఎంత దిగజారిందో ఆమె ఆత్మహత్యే నిదర్శనం
* మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబు, దత్తపుత్రుడి మీద
* దేవుడు పెద్ద స్క్రిప్ట్ ఏదో రాశాడు..
* అందుకే ఈ దెబ్బ కన్ను, కణతిపై తగల లేదు
* విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి జగన్
* పార్టీ సోషల్మీడియా ప్రతినిధులతో సమావేశం
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం :
తనపై జరిగిన దాడిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో మంగళవారం ఉదయం వైసీపీ సోషల్మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఆయన రాయి దాడి ఘటన, సోషల్మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేశారని, వ్యవస్థ ఎంత దిగజారిందో చెప్పడానికి ఆమె ఆత్మహత్యే నిదర్శనం అని వెల్లడించారు. విజయానికి దగ్గరగా ఉన్నామనే మనపై దాడి చేస్తున్నారని తెలిపారు. ‘‘రాయి దెబ్బ కన్ను మీదో, కణతి మీదో కాకుండా, ఇక్కడ తగిలింది అంటే.. దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో రాశాడు. భయం లేదు.. గెలిచేది మనమే. 175కు 175 ఎమ్మెల్యే సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు మనమే గెలుస్తున్నాం. ఒక్క సీటు కూడా తగ్గేది లేదు. మీ భుజస్కందాల మీదే బాధ్యత పెడుతున్నా. ఫోన్ అనే ఆయుధం మీ చేతుల్లో ఉంది. అటువైపు వంద మంది ఈనాడులు, వంద మంది ఆంధ్రజ్యోతిలు, వంద మంది టీవీ5లు, వంద మంది చంద్రబాబులు, వంద మంది దత్తపుత్రులు వచ్చినా, వారికి జాతీయ పార్టీలు సహకరించినా, కూటములు కట్టినా, కుతంత్రాలు పన్నినా, భయం లేదు మీ జగన్ అన్నకు. పైన దేవుడు ఉన్నాడు.. కింద మీరంతా ఉన్నారు.. మీ అన్నకు అండగా.’’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
ఏపీకి విశాఖ డెస్టినీ
జగన్ తో సమావేశంలో వైసీపీ సోషల్మీడియాకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారితో జగన్ మాట్లాడుతూ సోషల్మీడియా మనతోనే ఉందని చెప్పారు. సెల్ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ మనతోనే ఉన్నారని తెలిపారు. కుట్రలు తిప్పికొట్టాలని ప్రతినిధులకు సూచించారు. సోషల్మీడియాలో వేధింపులకు గురైన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజధాని విశాఖ గురించి మాట్లాడుతూ .. సీఎం వచ్చి విశాఖలో కూర్చుంటే బెంగళూరు, హైదరాబాద్ తో పోటీ పడతామని, విశాఖ ఏపీకి డెస్టినీ అవుతుందని చెప్పారు.
———————–