* పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చాలు
* హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం కోర్టు
ఆకేరు న్యూస్, విజయవాడ : పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన వైసీపీకి అక్కడ కూడా చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సమర్దిస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతా ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గతంలో చ్చిన ఆదేశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ.. ముందుగా ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ అక్కడ వైసీపీకి షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో తాము కలుగజేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈసీ జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ మార్గదర్శకాలపై తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనుండంతో.. ఈరోజే ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోర్టును వైసీపీ కోరింది. ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలట్లకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు బరి తెగించినట్లుగా ఉన్నాయన్నారు. సీల్.. ఇతర వివరాలు లేకుండా.. కేవలం అధికారి సంతకం ఉంటే సరిపోతుందని చెప్పడం అడ్డగోలుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకం ఎవరిదన్న విషయం ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఈ ఆదేశాలను ఈసీ తికమక పెట్టడానికి ఇచ్చిందో.. ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అయితే.. సుప్రీంకోర్టులో కూడా వైసీపీకి చుక్కెదురుకావడంతో ఆ నేతలు ఢీలా పడ్డారు.
————————-