* నేతల ఇళ్లల్లో నాటు, పెట్రోబాంబుల కలకలం
* పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి..
* ఆందోళనలపై ఈసీ సీరియస్
* పలువురు అధికారులపై తీవ్రమైన చర్యలు
ఆకేరు డెస్క్ : పల్నాడు జిల్లాలో ఇంకా ప్రశాంత వాతావరణం ఏర్పడలేదు. ఎక్కడ చూసినా పోలీసుల బూట్ల చప్పుళ్లు, ఇరువర్గాల ఘర్ణణలు.. కలకలం రేపుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా పిన్నెల్లి నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రో బాంబులు భారీ ఎత్తున దొరకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ స్థాయిలో బాంబులను సిద్దం చేసుకుని ఉన్నారంటే దాడులకు ముందస్తుగానే వ్యూహరచన చేసుకున్నారన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అల్లర్లు జరిగిన గ్రామల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నేతల ఇళ్లలో దాచిన పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు భారీగా స్వాధీనపరచుకున్నారు. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి, సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామాల్లో నిర్వహించిన సోదాల్లో బాంబుల డంప్‌లు బయటపడ్డాయి. పిన్నెల్లిలో చింతపల్లి సైదా, నన్ని, అల్లాభక్షుల గృహాల్లో 51 పెట్రోలు బాంబులు, మరణాయుధాలను స్వాధీన పరుచుకున్నారు. మాదలలో నిర్వహించిన తనిఖీల్లో కూడా ఓ వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రో బాంబులు బయటపడ్డాయి.
కొనసాగుతున్న 144 సెక్షన్
ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారని నేపథ్యంలో పల్నాడు అంతటా 144 సెక్షన్ కొనసాగుతోంది. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, కారంపూడి, మాచర్ల పట్టణాల్లో దుకాణాలను పోలీసులు మూయించారు. వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై అధిక సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు కాసు మహేశ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల గృహ నిర్బంధం గురువారం కూడా కొనసాగింది. ముందస్తు చర్యలో భాగంగా పోలీస్ పికెట్లు కొనసాగిస్తున్నారు. నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీంగ్ సంఘటనలపై దాదాపు 40 కేసులు నమోదు చేశారు.
అధికారులపై ఈసీ కొరడా
పోలింగ్ రోజు జరిగిన హింసపై పూర్తి వివరాలు తీసుకున్న ఈసీ.. 16 మంది అధికారులపై కొరడా ఝళిపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. సీఈసీ రాజీవ్‌కుమార్, కమిషనర్లు సీఎస్, డీజీపీలతో సమావేశమయ్యారు. దేశంలో ఎక్కడా జరగని అల్లర్లు.. హింసాత్మక ఘటనలు ఏపీలో జరగటంపై.. ఈసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏ ఏ జిల్లాలో ఏ ఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో… ఘటనలతో సహా.. సీఎఎస్.. డీజీపీ ఈసీకి పూర్తి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం అధికారులపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్‌ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ.. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్‌లపై బదిలీ వేటు వేసింది. ఈ మూడు జిల్లాలకు చెందిన 12 మంది కిందిస్థాయి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. వేటు పడిన 16 మందిపైనా శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. విచారణ జరిపిన అనంతరం ఈరోజు సాయంత్రం 3 గంటల్లోగా వారిపై ఛార్జిషీట్ వేయాలని ఈసీ స్పష్టం చేసింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తిచేసి.. తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని సూచించింది. తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని, శాఖాపరమైన చర్యలు నిలిపివేయకూడదని పేర్కొంది. సస్పెండైన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ అయిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ స్థానంలో అర్హులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేర్లతో జాబితాను ఈరోజు ఉదయం 11 గంటల్లోగా పంపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
—————–