* 31 వేల కోట్లు రూపాయలు ఖర్చవుతుంది
* రైతు భరోసా అమలు కోసం ఉపసంఘం
* ప్రభుత్వ నిర్ణయాలు ఇక ఈ మంత్రులనే అడగాలి
* కాంగ్రెస్ మాటే శిలాశాసనం
– సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రేపాయల రుణ మాఫీ చేస్తున్నాం. ఇందుకోసం 31 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శక్రవారం మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2022 మే 6 వ తేదీన వరంగల్ లో జరిగిన రైతు డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతులకు ఒకే సారి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ మాట ఇస్తే అదీ శిలా శాసనం లాంటిది. కరీంనగర్ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట మేరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ నిలబెట్టుకున్నది. దీని వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినప్పటికీ మాట తప్ప లేదు.. మడమ తిప్పలేదన్నారు. అదేవిదంగా ఆర్థిక భారం అయినప్పటికీ రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీని చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
* 2023 డిసెంబర్ 9 కటాఫ్ డేట్
తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ ఎస్ ప్రభుత్వం కేవలం రెండు విడతల్లో 28 వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసింది.
గత ప్రభుత్వం రైతు రుణ మాఫీ విషయంలో అనేక సార్లు మాట మార్చింది. ఒకే సారి కాకుండా నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని ప్రకటించింది. వ్యవసాయాన్ని గత ప్రభుత్వం సంక్షోభం వైపు నెట్టింది. మా ప్రభుత్వం వ్యవసాయం దండగ కాదు, పండుగ చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక బాధ్యతతో అతి తక్కువ సమయంలోనే 31 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 2018 డిసెంబర్ 11 వరకు తీసుకున్న రుణాలకు సంబందించి మాఫీ ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2018 డిసెంబర్ 12 తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
* రైతు భరోసా అమలుకు మంత్రి వర్గ ఉపసంఘం
గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో అనర్హులకు ఆర్థిక చేయూతనందించిందన్నారు. సంపన్న వర్గాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, చివరకు కేసీఆర్ లాంటి ఫామ్ హౌజ్ యజమానులకు సైతం రైతు భరోసా అందిందన్న విమర్శలున్నాయి. నిజమైన రైతులకు రైతు భరోసా అమలుకు డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో సభ్యులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి జూలై 15 లోపు నివేదిక సమర్పిస్తుంది. దీని ఆధారంగా రైతు భరోసాకు సంబందించి విధివిదానాలను రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
* ఆ ఇద్దరు మంత్రులదే బాధ్యత
మీడియాలో కథనాలు వాస్తవాలకు దూరంగా అభూత కల్పనలతో వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబందిచిన ఏదైన వార్తా కథనం రాయాలంటే అధికారికి సమాచారం తీసుకోవాలి. ఇందుకోసం ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను నియమిస్తున్నాం. మీడియా ప్రతినిధులు ఏదైనా సమాచారం కావాలంటే ఈ ఇద్దరు మంత్రులను సంప్రదించాలి. వీరు ఎల్లప్పుడూ మీడియాకు అందుబాటులో ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, కొండా సురేఖ , తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు తదితర మంత్రులు పాల్గొన్నారు.
———————————–