* ప్రభుత్వాన్ని పక్కదారి పట్టే ప్రయత్నం చేస్తున్నారు..
* కుట్రలను తిప్పి కొట్టేలా అధికారులను అప్రమత్తం చేశా..
* చెత్త రాజకీయాలు చేయొద్దు
* అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవు
* జక్కంపూడిలో ఒకరి ని సస్పెండ్ చేశా
* సరిగా పనిచేయకపో్తే మంత్రులపైనా చర్యలు
* మానవత్వంతో పని చేయండి
* చివరి బాధితుడికీ సాయం అందేవరకూ విశ్రమించేది లేదు
* విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్రంలో కుట్రలు జరుగుతూనే ఉన్నాయని, కుట్రలను తిప్పికొట్టేలా అధికారులు వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Ap Cm Chandrababu Naidu) తెలిపారు. చెత్త రాజకీయాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. విజయవాడ వరదల(Vijayawada Floods) నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ జిల్లాలోని కలెక్టర్ రేట్ లో మీడియాతో మాట్లాడారు. బాధితుల సహాయం కోసం 32 మంది ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే అన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామన్నారు. చివరి బాధితుడికి కూడా న్యాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. బాధితుల దగ్గరకే ఆహారాలు పంపిణీ చేస్తున్నామని, సాధ్యమైనంత ఎక్కువ డ్రోన్లు తెప్పిస్తున్నామని వెల్లడించారు. సమస్యలపై రోజూ రివ్యూ చేస్తున్నానని, నివేదికలు తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంత ఖర్చయినా చేస్తామని, ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తనదని బాధితులకు హామీ ఇచ్చారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం పనిచేయాలని, సానుకూల వార్తలను ఇవ్వాలని మీడియా(Media)కు కూడా చంద్రబాబు సూచించారు.
సంయమనం పాటించండి..
ప్రజలు కూడా సమన్వయం పాటించాలని, అర్ధగంట ఆలస్యం అవుతుందని ఆవేశ పడితే అది అయిదు గంటలు, ఆరు గంటలు ఆలస్యం కావచ్చని, మొత్తం వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పారు. సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే.. అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఇది మనందరి బాధ్యత అన్నారు. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వంట చేసి క్యారేజీ తీసుకెళ్తారా, పరామర్శిస్తారా, నిత్యాసవరాలు ఇస్తారా, డబ్బులు ఇస్తారా మీ ఇష్టం అన్నారు. ఎవరి శక్తి మేరకు వారు సహాయం చేయాలన్నారు.
అధికారులకు, మంత్రులకు హెచ్చరిక..
లా అండ్ ఆర్డర్(Law and Order)ను మెయింటెన్ చేసే బాధ్యత మీదేనని, సక్రమంగా పనిచేయాలని అధికారులకు చంద్రబాబునాయుడు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశానని, సరిగా పని చేయకపోతే మంత్రులపై కూడా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అయిదేళ్లుగా అధికార వ్యవస్థ సరిగా పనిచేయలేదని ఆరోపించారు.