భారీవర్షాల నేపథ్యంలో
విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీసీఎం కాన్ఫరెన్స్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆదివారం నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సీఎండీ కంటి వరుణ్ రెడ్డి, 16 సర్కిళ్ల ఎస్ఈలు, 40 మంది డీఈలతో మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎక్కడ అంతరాయాలు లేకుండా చూడాలని సంబంధిత ఎస్ఈలను ఆదేశించారు. అలాగే, నీట మునిగిన సబ్ స్టేషన్ ల వివరాలను తెలుసుకొని ప్రత్యామ్నాయ సరఫరా అందించాలని, సరఫరా స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. విపత్తులో ముందుగా నష్టపోయే శాఖ విద్యుత్ శాఖ ఉంటుంది కాబట్టి సిబ్బంది అందరు 24/7 అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరా లేని చోట పునరుద్ధరించాలని కోరారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, చెట్లు విరిగి స్తంభాలు దెబ్బతిన్నచోట, ఇన్సులేటర్లు ఫెయిల్ అయిన వాటిని యుద్దప్రాతిపదికన మరమ్మతు చేయాలన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధి విద్యుత్ సరఫరా గురించి క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్పీడీసీఎల్ నలుగురు సీఈలు, 16మంది ఎస్ఈలు, 40మంది డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట పునరుద్ధరణకు కలెక్టర్, పోలీస్, రెవెన్యూ జిల్లా శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వరదల వల్ల నీట మునిగిన సబ్ స్టేషన్లు, పిడుగులు పడి దెబ్బతిన్న చోట మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా వాటి పరిధిలో ఉన్న గ్రామాలకు పక్క సబ్ స్టేషన్ నుంచి విద్యుత్తును సరఫరా చేయాలని ఆదేశించారు. 24/7 అప్రమత్తంగా ఉండి కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అమలు చేయాలని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైరు, ట్రాన్స్ ఫార్మర్లు మిగతా మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం పునరుద్ధరణపై ఎస్ఈ లతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు, వాగుల వరద ఉధృతిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అనుక్షణం ఎక్కడికక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. విద్యుత్, నిత్యావసర సరుకుల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే తప్ప బయటకు రావొద్దని స్పష్టం చేశారు. శిథిలమైన పురాతన భవనాల్లో ఉండకుండా వెంటనే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. విద్యుత్ అంతరాయానికి సంబంధించిన సమస్యలు ఉంటే ప్రజలు వాటి పరిష్కారం కోసం విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన 1912, 18004250028 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రజలనుంచి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి కంట్రోల్ రూమ్ నుంచి నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. సామాజిక బాధ్యతను విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించే విద్యుత్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రాత్రుల్లో సైతం యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేయుటకు తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బందిని ప్రశంశించారు. ఉద్యోగ ధర్మం కాకుండా సమాజ సేవ భావంతో పనిచేస్తున్నందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.