ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిమ మధ్య రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే చర్లపల్లి నుంచి పలు రైళ్లు నడుస్తుండగా.. త్వరలో ఎంఎంటీఎస్ సర్వీస్లను మరింత పెంచనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. ప్రస్తుతం చర్లపల్లి నుంచి ఒక ఎంఎంటీఎస్ నడుస్తుండగా.. మరో 4, 5 నెలల్లో ఈ సర్వీసులను మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ – గుంటూరు మార్గంలో డబ్లింగ్ పూర్తయితే మరికొన్ని రైళ్ల్లు నడిపే వెసులుబాటు ఉంటుందని, మరో పక్క ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచేందుకు పనులు సాగుతున్నాయని తెలిపారు. రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో 10 జతల రైళ్లను తరలించనున్నామని తెలిపారు. ఈ రైళ్లకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులుంటాయన్నారు. హైదరాబాద్ స్టేషన్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులతో తలెత్తే ఒత్తిడిని తగ్గించేందుకు మరిన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడపాలని నిర్ణయించామని చెప్పారు. ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ లు నడుపుతామని స్పష్చం చేశారు. చార్మినార్, గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ లను మార్చి నుంచి నడుపుతామని, మే నెలాఖరుకల్లా మరో 8 జతల రైళ్లను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైన్ చెప్పారు.
ఘట్ కేసర్ – యాదాద్రి ఎంఎంటీఎస్ లైన్ కోసం రూ.650 కోట్లు ఖర్చవుతుందని, దీనికి సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్ధం చేశామని జైన్ అన్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం రూ.491 కోట్లు బకాయి పడిరదని తెలిపారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. ఇది పూర్తయితే కేవలం రూ.20 ఛార్జీతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. ఇక రాష్ట్రంలో చేపట్టిన అమృత్ స్టేషన్ల అభివృద్ది పనులు వచ్చే ఏడాది చివరి వరకు పూర్తవుతాయన్నారు. పింక్ బుక్ ను పార్లమెంటులో ఇంకా ప్రవేశపెట్టకపోవడంతో రైల్వే బడ్జెట్ కేటాయింపుల వివరాలను ఇప్పుడే వెల్లడిరచలేమని జైన్ చెప్పారు. ప్రాజెక్టులు, సర్వేలు, డీపీఆర్ లు, సౌకర్యాలు వంటి అంశాలన్నీ పింక్ బుక్ లోనే ఉంటాయన్నారు. ఇక ఈసారి రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు భారీగానే కేటాయింపులున్నాయి. ఏపీకి రూ.9.417 కోట్లు, తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడిరచారు. ఈ క్రమంలోనే కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.
……………………………………………………..