వరంగల్ లో బీఆర్ఎస్ కు మరోషాక్…
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్లో బీఆర్ ఎస్ కు (BRS ) మరో షాక్ తగిలింది. పార్టీ పరాజయం పాలయిన తర్వాత ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. చాలా కాలంగా బీఆర్ ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ( Gundu Sudharani ) గురువారం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కండువా కప్పి సుధారాణిని పార్టీలోకి ఆహ్వానించారు.
* మేయర్ రాకను వ్యతిరేకించిన కొండా దంపతులు
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న గుండు సుధారాణి ని కొండా దంపతులు తీవ్రంగా వ్యతిరేకించారన్న ప్రచారం జోరుగా సాగింది . అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్పోరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండా సురేఖ గెలుపు కోసం కృషి చేశారు. బీఆర్ ఎస్ ను వీడి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పోరేటర్ గుండేటి నరేందర్ కు మేయర్ గా అవకాశం ఇస్తామని కొండా మురళీధర్ రావు హామి ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ సుధారాణిని పదవి నుంచి దించేసి నరేందర్ ను మేయర్ అవుతాడనుకున్నారు. . దీంతో సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇపుడు కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్ననేతలంతా పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీ వారే.. గుండు సుధారాణి కూడా తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేశారు. ఆ పరిచయాల ద్వారా తమ వంతు ప్రయత్నాలు చేశారు. విషయం తెలిసిన కొండా దంపతులు సుధారాణి చేరికను చాలా కాలం పాటు నిలువరించ గలిగారు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ద్వారా పార్టీలో చేరిపోయారు. వరంగల్ తూర్పు లో ఇక రాజకీయ పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే..
——————————–