* కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామి నెరవేర్చ లేదు
* బీజేపీకి 200 సీట్లు దాటవు
* అచ్చేదిన్ కాదు, సచ్చేదిన్
* స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వస్తుంది
– మాజీ సీఎం కేసీఆర్
ఆకేరు న్యూస్ , వరంగల్ : సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) కి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలువదు. కృష్ణా నదిని నేనే కట్టిన అంటున్నాడు. ఎక్కడైన నదిని ఎవరైనా కట్ట గలుగుతరా.. అని బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ( KCR ) ఎద్దేవా చేశారు. ఆదివారం సాయంత్రం హనుమకొండ చౌరాస్తా రోడ్ షో లో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నడు. గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటడటా.., పేగులు తీసి మెడలో వేసుకుంటడటా.. చివరకు కేసీఆర్‌ను జైలుకు పంపిస్తా అని మాట్లాడుతున్నడు.. జైళ్ళకు భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్దించేదా.. ఇలాంటి వాటికి నేనేమి భయపడను అని కేసీఆర్ అన్నారు. అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళే రాలేదని అంటున్నడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పారెస్పీ స్టేజ్ 2 అని ఏళ్ల తరబడి ఎలాంటి పని కాకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు. ఏరికోరి మొగున్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి అయిందన్నారు. పంటలు ఎండి పోతున్నాయి. కరెంట్ కష్టాలు మొదలైనాయి. సాగు, తాగు నీళ్ల సమస్య మొదటికొచ్చిందన్నారు కేసీఆర్. రైతు బంధు, తులం బంగారం, రెండు లక్షల రుణమాఫీ కాలేదు.. ఒక్కొక్క అంశాన్ని చెబుతూ మాఫీ అయిందా అంటూ.. ప్రజలను అడిగారు..లేదు.. లేదు.. కాలేదు . అంటూ జవాబిచ్చారు. ఇలాంటి సమయంలో రాష్ట్రానికి ఎవరు కావాలే.. అని మరోసారి ప్రజలను ప్రశ్నించారు… మీరే .. మీరే ..అంటూ ప్రజలు స్పందించారు.. మరీ .. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కింద పడేస్తిరి.. ఇపుడు కావాలే.. కావాలే అంటే ఎట్లా అని నవ్వుతూ అన్నారు. బీఆర్ ఎస్ పాలనలో అన్ని రకాల అనుమతులు 21 రోజుల్లో వచ్చేటట్టు చట్టం తెచ్చాం. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటించడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలయింది. లంచాల కోసమే అనుమతులు ఇవ్వకుండా ఆపుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గోదావరి నది నీళ్ళను తమిళనాడు, కర్ణాటకరాష్ట్రాలకు తరలించుకుపోతామని రాష్ట్ర ప్రభుత్వానికి నోటిస్ పంపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు. ఇప్పటికే కృష్ణానదిని కేఆర్ ఎంబీకి అప్పగించింది. ఇపుడు గోదావరిని ఎత్తుకు పోతుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రజలను అడిగారు..
* స్టేషన్ ఘన్పూర్ లో ఉప ఎన్నిక వస్తుంది.
కడియం శ్రీహరి పార్టీలోకి పిలిచి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినం.. ఆయన చేసిన మోసం వల్ల ఆయన రాజకీయ జీవితానికే సమాధి కట్టుకున్నడు. త్వరలో కడియం శ్రీహరి ( Kadiam Srihari ) శాసన సభ్యత్వం రద్దవుతుంది, మూడు నెలల్లో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎన్నికలు వస్తాయి. డాక్టర్ రాజయ్య మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడని కేసీఆర్ అన్నారు.
* బీజేపీకి 200 సీట్లు దాటవు
బీజేపీ అధికారంలోకి రావడానికి గత పదేళ్ళ నుంచి ఎన్నో వాగ్దానాలు చేసింది. ఏవి కూడా అమలు కాలదని కేసీఆర్ అన్నారు. బీజేపీ పాలన వల్ల అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్ వచ్చిందన్నారు. బీజేపీ విద్వేష పూరిత రాజకీయాలకు పెట్టింది పేరు. బీజేపీకి ప్రజలను బాగు చేసే ఎజెండా లేనే లేదు. కాజీపేటకు వచ్చే కోచ్ ఫ్యాక్టరీని నరేంద్ర మోది ( Narendra Modi) గుజరాత్‌కు మోది ఎత్తుకు పోయిండన్నారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 200 లకు మించి సీట్లు రావు. ఇప్పటికే జరిగిన ఎన్నికల సర్వే ల ద్వారా ఈ సమాచారం తెలుస్తోంది. కేంద్రంలో హంగ్ గవర్నమెంట్ ఏర్పడబోతుంది. పదో, పదిహోనో ఎంపీ సీట్లో గెలుచుకుంటే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో క్రియా శీలక భూమిక పోషిస్తాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చేందుకు తీవ్రంగా కొట్లాడే అవకాశం బీఆర్ ఎస్‌కు వస్తుందన్నారు. అందుకే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుధీర్ కుమార్‌ను గెలిపించండని కేసీఆర్ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజశ్వర్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి , నన్నపు నేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
———–
————————————————–