* అభివృద్ధి చేయడమే తప్పా..
* కేసీఆర్ ఒక టైగర్..
* రేవంత్ దుర్భాషలాడుతున్నారు
* కరెంట్ కోతలు రాష్ట్ర భవిష్యత్ కు ప్రమాదం
– మీడియా సమావేశంలో కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రజలు కేసీఆర్ ను టైగర్ అంటారు.. పులిని ఎందుకు బోను లో వేస్తారు.. అభివృద్ధి చేయడమే తప్పా అని బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ (KCR ) ప్రశ్నించారు. జైలుకు పంపుతాం.. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కడతాం.. అని అసెంబ్లీ లోపల, బయట రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ ఏ ఆగస్టు 15కు మాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదారునెలల్లోనే తెలంగాణలో కరెంటు కోతలు మొదలైనయని, ఈ కరెంటు కోతలు రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరమని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని, రైతు బంధు ఎగ్గొట్టేందుకు సాకులు వెదుకుతున్నారని ఆరోపించారు. డిసెంబర్ 9న పదిన్నర గంటలకు రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. చాలా బాధాకరం అనిపిస్తుంది.. సీఎం మాట్లాడాల్సిన మాట కాదు అది. ఆయన ధైర్యమా.. అర్భకత్వామా.. తెలివి తక్కువతనమా అనేది అర్థం అయితలేదు. ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే రూ. 40 వేల కోట్లు రుణమాఫీని ఎడమ చేతితో మాఫీ చేస్తాను అంటుండు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూశాను. ఒక వ్యక్తి మూర్ఖత్వానికి అవధులు ఉంటాయి. మీడియా ముందు ఒళ్లు మరిచి మాట్లాడకూడదు. ఇది సోషల్ మీడియా యుగం. జాగ్రత్తగా మాట్లాడాలని కేసీఆర్ హెచ్చరించారు.
కరెంట్‌ను దెబ్బతీస్తుంన్రు
‘ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కరెంటు అనేది చాలా ముఖ్యం. పిండి గిర్ని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచీ హెలికాప్టర్లు తయారు చేసే భారీ కంపెనీల వరకు కరెంటు కోతలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. పరిశ్రమలు నడిపేవాళ్లు ధైర్యం కోల్పోతారు. అది చాలా తీవ్ర పరిణామం. వ్యవసాయం చేసే రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీల వరకు కూడా కరెంటు కొరత దెబ్బతీస్తది. అది ప్రమాదకరం. రాష్ట్ర భవిష్యత్తుకే ఇబ్బంది కలుగుతుంది’ అని కేసీఆర్ అన్నారు. ‘కరెంటును ఎందుకు దెబ్బతీసిండ్రో నాకు అర్థం కావడంలేదు. ఏం కొరత లేదు. సింగరేణి మనది. బొగ్గు కొరత లేదు, నీళ్ల కొరత లేదు. మనుషుల కొరత లేదు. అదే ఉద్యోగస్తులు. ఎందుకు నడపలేదు కరెంటును..? ఏం సమాధానం చెప్తరు ప్రజలకు. కేసీఆర్ పక్కకు జరగంగనే కట్కా బంద్ చేసినట్టే కరెంటు ఎక్కడికి పోయింది..? తొమ్మిదేళ్లు జరిగిందిగా.. ఇప్పుడు వీళ్లు కొత్తగా చేసేదేముంది..? ఉన్నదున్నట్టు నడిపిస్తే అయిపోయేది. వాళ్లు అతిచేశారు. అతికి పోయి ఈ పరిస్థితికి తెచ్చింన్రు’ అని కేసీఆర్ విమర్శించారు.
—————————————