*ప్రేమించడం లేదని యువతిపై సుత్తితో దాడి
ఆకేరు న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్లో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఒక యువకుడు, యువతిపై అత్యంత క్రూరంగా దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి సుత్తితో ఆమె తలపై బలంగా బాదడంతో యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. నిందితుడు కొంతకాలంగా సదరు యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అయితే, ఆమె అతనిని దూరం పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు, ఎలాగైనా ఆమెపై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి లోపలికి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న సుత్తితో ఆమె తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న యువతిని చూసి నిర్ఘాంతపోయారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నిందితుడిని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఆగ్రహంతో అతడిని సమీపంలోని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన యువతిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
