* నేటి నుంచి బతుకమ్మల సందడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పూల పండుగకు తెలంగాణ పల్లెలు ముస్తాబయ్యాయి. హైదరాబాద్‌లోనూ సందడి రెండు రోజుల ముందే మొదలైంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..అంటూ కూకట్‌పల్లిలో మహిళలు ఆటపాటలతో గౌరవమ్మను పూజిస్తున్నారు. వానాకాలం వేళ్లే ముందు తెలంగాణ ప్రాంతంలో విరబూసే తంగేడు పువ్వులతో ఆహ్లాదంగా మారుతుంది. ఎటు చూసిన మత్తడి దూకే చెరువులు, నిండు కుండల్లా కుంటలు, ఆపై గట్ల మీద పూసిన గునుగు పువ్వులతో తెలంగాణ పల్లెలకు అందాలు సంతరించుకున్నాయి. ఇదే రోజుల్లో ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి, వైభవానికీ ప్రతీక. మహాలయ పక్ష అమావాస్య అయిన ఈరోజు ప్రారంభమైంది. కొన్నిచోట్ల పిత్రు అమావాస్య నుంచి మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి..ఆ తెల్లవారు జాము నుంచి ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చుతారు. లయబద్ధంగా ఆడుతారు. లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడి గురించిన పాటలు మారుమ్రోగుతుంటాయి. బతుకమ్మ మీదనే ఎక్కువగా పాటలు ఉంటాయి. అక్టోబర్ 2న ప్రారంభమయ్యే ఈ బతుకమ్మ వేడుకలు 9 రోజుల పాటు వైభవంగాసాగుతాయి. అక్టోబర్ 10వ తేదీన సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి.
………………………