* ఎండలు మండుతున్నాయి
* మూడు రోజుల వరకు జాగ్రత్త
ఆకేరు న్యూస్ , వరంగల్ :
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్ళాలంటేనే భయం.. భయంగా ఉంటోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా వీస్తున్నాయి. మూడు రోజుల పాటు మరితం తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ( IMD ) బుధవారం ప్రకటించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. గురు వారం , శుక్ర వారాల్లో పలు జిల్లాలో అక్కడక్కడ వడగాలులు ( Heat waves ) వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం కొమురం బీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజులపాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.. తెలంగాణ లోని 20 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదయ్యేఅవకాశాలున్నాయని తెలిపింది.
మోస్తరు వర్షం కూడా ..
ద్రోణి మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వెల్లడించింది.
——————-