* ప్రతి ఇంట్లో జ్వరాల బాధితులు
* విజృంభిస్తున్న డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా
* రోగులతో కిక్కిరిస్తున్న ఆస్పత్రులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad)లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దాదాపు ప్రతీ ఇంట్లో ఒకరు జ్వర బాధితులు ఉంటున్నారు. డెంగీ(Dengue), మలేరియా(Malaria), టైఫాయిడ్(Typoid) లాంటి విష జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు విష జ్వరాలు సోకడంతో ఆస్పత్రులు కిక్కిరిస్తున్నాయి. బెడ్లు లేక చిన్నారి పేషెంట్లు వెయిటింగ్లో ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వర్షాల కారణంగా దోమలు పెరిగి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుండడంతో ఈ దుస్థితి తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టు పక్కల జిల్లాల్లోనే డెంగీ, మలేరియా, గన్యా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
దోమల విజృంభణ.. రోగాల దాడి
వర్షాల కారణంగా కొన్ని రోజులుగా గ్రేటర్లో పారిశుద్ధ్యం లోపించింది. దీంతో దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ఫలితంగా డెంగీ, మలేరియా, గన్యా వంటి జ్వరాలు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్(Hyderabad)తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి(Rangareddy), మేడ్చల్(Medchal), సూర్యాపేట(Suryapet), నల్గొండ(Nalgonda), ఖమ్మం(Khamam) జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4,500 వరకు డెంగీ కేసులు నమోదు కాగా.. అందులో మూడో వంతు హైదరాబాద్ నగరంలోనే నమోదైనట్లు తెలిసింది. అనధికారికంగా ఈ కేసులు అంతకు 10 రెట్లు అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గాంధీ(Gandhi), ఉస్మానియా(Osmania), నిలోఫర్(Nilofer) ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య రెట్టింపు అవుతోంది. గాంధీలో సాధారణ రోజుల్లో 1800 నుంచి 2000 ఉండగా, ప్రస్తుతం 3000 వరకు ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు నీలోఫర్ కూడా కిక్కిరిస్తోంది. ఓకే బెడ్డుపై ముగ్గురు, నలుగురు పిల్లలను పడుకోబెడుతున్నారు. ఒకరి జబ్బు ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక కిందే చికిత్స పొందుతున్నారు.
ఆస్పత్రులకు రోగుల క్యూ
ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వస్తున్న పలువురిలో గన్యా, మలేరియా, డెంగీతో పాటు జపనీస్ ఎన్సెఫలైటిస్ లక్షణాలు కూడా ఉంటున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. అనుమానిత కేసుల రక్త నమూనాలు సేకరించి నిర్దారిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని కుటుంబాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది జ్వరాల బారినపడి హాస్పిటల్‌కు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్(Govt Hospitals)లో పడకలు సరిపోక ఓపీలోనే ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు. గన్యా, డెంగీ జ్వరాలు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి దోమలు(Mosquitos) కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్వరం, విపరీతమైన దగ్గు, తుమ్ములు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
—————————–—–