ఆకేరు న్యూస్, ఖమ్మం : కన్నతల్లి లేకుంటే రోడ్డుమీద ఎవరినైనా పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు.. నాన్న అనే పిలుపునకు ఒకసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా, దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికి సొంతం. నాన్నకు మాత్రమే ఆ ప్రత్యేకత. తండ్రి గొప్పతనాన్ని చాటుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కొటేషన్. అలాగే.. తండ్రి గొప్పతనం గుర్తించిన ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కుమారులు ఆయనకు నిలువెత్తు విగ్రహం కట్టారు. నిత్యం పూజిస్తున్నారు. నేలకొండపల్లి మండలం (Nelakondapalli mandal), భైరవునిపల్లి గ్రామా (Bhairavunipalli village) నికి చెందిన గుండపునేని పరాంకుశరావు (Gundapuneni Parankusa Rao) గత ఏడాది మృతి చెందాడు. అతని కుమారులు గుండపునేని రాంచందరావు (Gundapuneni Ramchandra Rao), గుండపునేని లక్ష్మణ్ రావు (Gundapunei Laxman Rao) లు తండ్రికి నిలువెత్తు విగ్రహం తయారు చేయించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తండ్రి పరాంకుశరావు సజీవంగా నిలిచి ఉన్నట్లుగా సహజత్వం ఉట్టిపడేలా నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని తమ పొలం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన గదిలో ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అటు వైపుగా వెళ్లేవారు విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. తండ్రిపై వారికున్న ప్రేమను గుర్తించి మెచ్చుకుంటున్నారు. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన తండ్రి ఆత్మ సజీవంగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని కుమారులు రాంచందరావు, లక్ష్మణ్ రావు చెబుతున్నారు.
------------------