* నేటి క్యాబినెట్లో ఆమోదం
* పలు కీలకాంశలపై నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. ఇందుకు నేడు నిర్వహించిన కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం చేపట్టింది. పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు. దమ్మాయి గూడ, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జీగీర్, మీర్పేట్, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, పెద్ద అంబర్ పేట్, జల్పల్లి, తుర్కయంజాల్, శంషాబాద్లు, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడున్న NPDCL, SPDCL రెండు డిస్కమ్లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్కు 40 ఎకరాల భూమిని కేటాయించారు. కొత్త పరిశ్రమలకు సొంతంగా విద్యుత్ తయారీకి అనుమతిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీ లతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీ లను ఏర్పాటు చేయాలని రేవంత్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
………………………………………
