
– మెరుగైన ఉపాధి కల్పించేలా కృషి చేయాలి
– అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది
– మంత్రి జి.వివేక్ వెంకటస్వామి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ) లో 98శాతం ప్రవేశాలు సంతోషం కలిగించే అంశమని మంత్రి జి.వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy)అన్నారు. అయితే ఈ సెంటర్లలో చేరిన వారికి మెరుగైన ఉపాధి కల్పించే బాధ్యత కూడా ఆయా సంస్థ ప్రతినిధులు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రెడ్‌హిల్స్(Redhills)లోని ఎఫ్టీసీఐఐ ఆడిటోరియంలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఏటీసీల ఏర్పాటు ఆహ్వానించదగినదన్నారు. ఆయా సెంటర్లలో మౌలిక సదుపాయాలు బాగున్నాయని టీచర్లు మెరుగైన బోధన చేయడం ద్వారా విద్యార్థులను నైపుణ్యం కలిగిన కార్మికులుగా తీర్చిదిద్దవచ్చని సూచించారు. ప్రపంచంలో అగ్రగామి పది సంస్థల సీఈఓలలో ఐదుగురు మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (Hyderabad Public School) విద్యార్థులేనని, అది ఉపాఽధ్యాయుల కృషి వల్లే అన్నారు. విద్యార్ధుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్న ఆయన ఉపాధి శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్‌ను భాగం చేయాలని కోరారు.ఉపాధ్యాయ వృత్తికి లభించినంత గౌరవం మన సమాజంలో ఇతర వృత్తిల్లోకి వ్యక్తులకు లభించవన్నారు. కార్యక్రమంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ కార్యదర్శి దాన కిశోర్, ఉపాధి శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………..