* అభివృద్ధి పనులకు రూ.1.92 కోట్లు నిధులు మంజూరు
* 2026లో జరిగే మహాజాతర నాటికి పనులు పూర్తి
ఆకేరున్యూస్, హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. 2026లో జరిగే మహాజాతర నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు పట్టుదలగా ఉండగా.. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1.92 కోట్లు మంజూరు చేసింది. 1971లో దేవాదాయశాఖ వనదేవతలిద్దరికీ ఆలయాలు నిర్మించింది. అవి చిన్నగా ఉండటం, ప్రస్తుతం భక్తుల రాక పెరగడంతో పూజా కార్యక్రమాలకు ఇబ్బందిగా మారింది. దీంతో నూతన నిర్మాణాలు చేపట్టాలని పూజారులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు.
దీనిపై దృష్టిసారించిన దేవాదాయశాఖ.. ఈ ఏడాది మహాజాతర ముగిసిన తర్వాత మార్చిలో ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో.. నవంబరులో రూ.1.92 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నెల 12న టెండరు ప్రక్రియ ముగిసింది. త్వరలోనే పనులు ప్రారంభించి మహాజాతర కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తామని.. మేడారం ఆలయ కార్యనిర్వహణాధికారి స్పష్టం చేశారు. మేడారం వెళ్లే రహదారుల అభివృద్ధికి రూ.17.50 కోట్లు, గెస్ట్ హౌస్ల నిర్మాణాలకు రూ.3.50 కోట్లు మంజూరు చేసి.. పనులు చేపట్టారు. తాజాగా.. వనదేవతల గద్దెల ప్రాంగణంలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందినట్లు సమాచారం.
…………………………………