* మొగిలయ్య మృతి పట్ల సీఎం సంతాపం
ఆకేరున్యూస్, వరంగల్ : జానపద కళాకారుడు మొగిలయ్య మృతిచెందారు. నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన ఆయన గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. కొన్నాళ్లుగా ఇంటి వద్ద వైద్య చికిత్స తీసుకుంటుండగా.. మృతి చెందాడు. కాగా, తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన బలగం సినిమాలో క్లైమాక్స్ పాటను మొగిలయ్య పాడారు. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు పాడిన ఈ పాట తెలంగాణ ప్రజలను కన్నీళ్లు పెట్టించింది.
మొగిలయ్య మృతి పట్ల సీఎం సంతాపం
తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం ‘శారద కథల’కు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య శారద తంబుర మీటుతూ, పక్కనే బుర్ర (డక్కీ) వాయిస్తూ వారి సతీమణి కొమురమ్మ పలు చోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివన్నారు. ఈ బాధాకర సమయంలో పస్తం మొగిలయ్య గారి సతీమణి కొమురమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
………………………………………