* కక్షసాధింపులపై కాదు.. ప్రజాపాలనపై దృష్టి పెట్టండి
* మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఆకేరున్యూస్, హన్మకొండ: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమకేసులు పెట్టడం కాదు.. మొదట ప్రజాపాలనపై దృష్టి పెట్టండని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పక్కన పెట్టేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్ల అవినీతి అన్నాడు.. ఫోన్ టాంపరింగ్ కేసులన్నాడు.. డ్రగ్స్ అని ఆర్భాటం చేశాడు.. ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయాడని.. ఇప్పుడు కొత్తగా ఈ కార్ రేస్‌లో అవినీతి అని కొత్త డ్రామా మొదలుపెట్టాడన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమకేసులు పెట్టి అరెస్టులు చేయడం తప్ప ప్రజాపాలనపై దృష్టి పెట్టింది లేదన్నారు. ఈ కార్ రేస్‌లో అవినీతి జరిగితే అసెంబ్లీలో చర్చపెట్టమని ఈ రోజు కూడా అసెంబ్లీలో అడిగామని.. దానికి సమాధానం చెప్పకపోగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలలో జరిగే ఈ కార్ రేసింగ్‌ని ఇండియాలో మన హైదరాబాద్‌లో జరిగేలా కృషి చేసిన ఘనత కేటీఆర్‌దే అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో ఐటి,ఇండస్ట్రియల్, ఫార్మా రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఆరునెలల నుండి అక్రమ కేసు పెట్టి కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని.. నీకు దమ్ముంటే కేటీఆర్‌ని అరెస్ట్ చేసి చూడు.. ఏమవుతాదో తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులు ఆపి ప్రజాపాలనపై.. రాష్ర అభివృద్ధికై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
………………………………………………