![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/download-15.jpg)
* ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.
బీపీఎస్సీ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను సోమవారం పోలీసులు భగ్నం చేసి.. అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన షరతులు లేని బెయిల్పై విడుదలయ్యారు. కాగా నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించిందని.. ఆయనను పాట్నాలోని ఆస్పత్రికి తరలించామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ప్రశాంత్ కిశోర్ చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. మళ్లీ ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడొద్దని హెచ్చరిస్తూ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ప్రశాంత్ దాన్ని తిరస్కరించారు. దీంతో ఆయన్ను బ్యూరో సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం కోర్టు షరతులు లేని బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. పోలీసులు దీక్షను భగ్నం చేసిన అనంతరం తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారనే విషయం తెలియజేయలేదని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు పోలీసు వాహనంలోనే కూర్చోబెట్టి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారన్నారు. సరైన పత్రాలు లేకుండానే తనను కోర్టు నుంచి పోలీసులు తీసుకెళ్లారని పేర్కొన్నారు. తనను జైలుకు కూడా తీసుకెళ్లలేదని పేర్కొనడం గమనార్హం.
………………………………………………….