![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-42-e1739459857464.jpg)
* ఇలా.. మొద‘లవ్’తుంది
* సమాజాభ్యున్నతికి ప్రేమా..? ఆకర్షణా..?
ఆకేరున్యూస్, వరంగల్: గుండెనిండా దాచుకున్న ఆకాశమంత ప్రేమను, మాటల్లో చెప్పలేని అనంతమైన భావాలను వెల్లడిరచే అపూర్వమైన ప్రేమికుల రోజు వచ్చేసింది. జాతి, కుల, మత, వర్గ, భాష, ప్రాంతీయ భేదాల్లేనిది.
ఇలా మొద‘లవ్’తుంది….
గుండెనిండా దాచుకున్న ఆకాశమంత ప్రేమను, మాటల్లో చెప్పలేని అనంతమైన భావాలను అదొక అందమైన లోకం. యువత హుషారుకు హద్దులుండవు. కవ్వింతలకు కళ్ళాలుండవ్. శృతిలేని పాటలు.. శతకోటి ఆటలు. ఒకరికొకరు ఇచ్చుకునే గ్రీటింగ్స్, వాటిలో చిలిపి కవితలు, ప్రేమ రాతలు.. కాలేజీల్లో, పార్కుల్లో, మాల్స్‌లో అంతటా వారే. అరె! ఏంటి ఈ ప్రత్యేకత అంటే? మరి ప్రత్యేకతే. ఫిబ్రవరి 14న ‘ప్రేమికుల రోజు’. అదే వారి ఖుషీకి కారణం. ప్రేమ జంటల చిరు కానుకలుగా గులాబీ పువ్వులు, చాక్లేట్లు, షేక్హాండ్లు.. ఒకటేమిటి ప్రేమైకజీవుల కోలాహలం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా అలా అలా ప్రవర్థమానమవుతూ వాలెంటైన్స్’డే’ ప్రాచుర్యం పొందింది. ‘చిరునవ్వుల వరమిస్తావా..చితి నుంచి లేచొస్తాను.. మరుజన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తాను..!’ లాంటి ప్రేమ కవితలు అతిశయాన్ని మేళవించుకుని ఉంటే.. ‘కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే..ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే..ఊహలన్ని పాటలే కనుల తోటలో..తొలి కలల కవితలే మాట మాటలో..’ అంటూ ప్రేమ గొప్ప ఉపశమనం కలిగిస్తుందని చెప్పడం.. ఏదేమైనా ప్రేమ చాలా గొప్పది. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రేమికుల రోజు ఎలా వచ్చిందంటే..
వాలెంటైన్ ఎవరు..? వాలెంటైన్ అనే ఒక ప్రవక్త ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. క్రీస్తుపూర్వం 270లో రోమ్ దేశంలో జీవించిన వాలెంటైన్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. దీంతో యువతలో వాలెంటైన్ పట్ల క్రేజ్ పెరిగింది. అదే సమయంలో రోమ్ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వాలెంటైన్ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. ఈ రోజును ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకొంటారు. ప్రేమంటే ఇచ్చిపుచ్చుకోవడం.. ఒకరిపట్ల ఒకరికి ఉండే నమ్మకం.. ఇలా ఎన్నో భావనలు.. స్వేచ్ఛగా.. స్వచ్ఛంగా.. తమకోసమే అన్న ఫీలింగ్.. అయితే అందరి మధ్య ప్రేమ ఇలాగే ఉందా? అంటే లేదనే చెప్పాలి. ప్రేమ ప్రేమనే కోరుకోవాలి. కానీ నేటి ప్రేమలు తామరాకుపై నీటిబొట్టులా ఉంటున్నాయి. కులమతాల అంతరాలు ప్రేమికులకు ఉచ్చు బిగిస్తున్నాయి. కులదురహంకార హత్యలు పెచ్చుమీరుతున్నాయి. కన్నబిడ్డల్ని సైతం పొట్టనపెట్టుకునేంతగా కసాయితనాన్ని నూరిపోస్తున్న పరిస్థితులు. ఈ అంతరాల కంచెల్ని తొలగించినప్పుడే నిజమైన ప్రేమ వర్ధిల్లుతుంది. ఇది ఇలా ఉంటే మరో వైపు కార్పొరేట్ శక్తులు ప్రేమను వ్యాపార సరుకుగా మార్చేస్తున్నారు. తమ ఉనికిని పెంచుకోవాలని తాపత్రయపడే రాజకీయ నాయకులు.. కుహనా సంస్థలు.. ప్రేమకు ఆటంకంగాను తయారవుతున్నాయి. ఈసారి మరింత హేయంగా వాలెంటైన్స్ డేని ‘కౌ హగ్ డే’గా జరపాలని కేంద్రం పిలుపునివ్వడం పై పరిస్థితులకు అద్దంపడుతోంది. అయితే ప్రజల నుంచి నిరసన వెల్లువెత్తడంతో రెండు రోజుల తర్వాత ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. ఈ తరహా పద్ధతులు సమాజానికి ఏ విధంగా ఉపయోగ పడతాయనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సి ఉంది.
సమాజాభ్యున్నతికి..
ప్రేమ.. ప్రాణి పుట్టినప్పటి నుంచి ఉంది. అది లేకపోతే మానవాళి మనుగడ ఉండేది కాదు. ఇది ఏ ఒక్కరోజుకో పరిమితమయ్యేదీ కాదు. నిరంతరం మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లా ఉంటుంది. అయితే అది నిజమైనదై ఉండాలి. సమాజాభ్యున్నతికీ, సహ వ్యక్తికీ ఉపయోగపడేదే నిజమైన ప్రేమ. కారల్ మార్క్స్-జెన్నీలది ప్రేమ వివాహమే. జెన్నీది ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం. అయినా తాము నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ సమాజాభ్యున్నతి కోసం తమ జీవితాల్ని అంకితం చేశారు. ఎన్నో కష్టనష్టాలను భరించారు. నిర్బంధ జీవితాన్ని అనుభవించారు. దుర్భర పరిస్థితుల్లో బిడ్డలను కోల్పోయారు. అయినా వారి ఆశయాన్ని వదులుకోలేదు. వారి మధ్య ప్రేమ ఏ నిర్బంధానికీ లొంగలేదు. ఏ కాఠిన్యానికీ కుంగలేదు. జీవితం చివరి వరకూ సమాజాభ్యున్నతికే పాటుపడ్డారు వారిద్దరూ. అలాంటి ప్రేమ వారికి మాత్రమేకాక సమాజానికీ ఉపకరిస్తుంది. పటిష్టమైన కుటుంబవ్యవస్థ నెలకొంటుంది.
ప్రేమా..? ఆకర్షణా..?
తెలిసీ తెలియని వయసు.. బాధ్యతా రహిత్యమైన పెంపకం.. నిర్లక్ష్యపు ప్రవర్తన.. ఇవన్నీ యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. వారి ఆలోచనా విధానమే సరిగా ఉండని పరిస్థితి. వారికి మార్గ నిర్దేశం చూపించే వారుండరు. అలాంటప్పుడే ఆకర్షణను ప్రేమగా భావిస్తారు. అంతర్జాల మాయలో పడతారు. మత్తు పదార్ధాల బారిన పడే అవకాశం ఉంటుంది. అయినా వారు చేసేది కరెక్టే అని గట్టిగా నమ్ముతారు. యువత బలహీనతను కొన్ని నిరోధక శక్తులు వినిమయ వస్తువుగా ఉపయోగించుకుంటున్నాయి. స్వార్థంతో కూడుకున్న ప్రేమ అనే భావన వారి జీవితంలో హాలాహలమై.. దావానలమై.. జీవితాన్నే నాశనం చేస్తోంది. ఇది ప్రమాద సంకేతం. జుగుప్సాకర, వికృత చిత్రాలను వెదజల్లుతున్న అంతర్జాల మాయాజాల ప్రభావం నుండి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. బంధనాల చదువులు.. కట్టి పడేసే కట్టుబాట్లు.. ఆకర్షించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ వినియోగం యువత సంకల్పాలకు సంకెళ్ళు వేస్తున్నాయి. వారి శక్తిని, యుక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. వారి ఆలోచనా సరళి అనంతం.. దానికి హద్దులు పెట్టి, సంకట స్థితిలో వదిలేయక సరైన మార్గ నిర్దేశం చేస్తే సమాజాభివృద్ధి జరుగుతుంది. బాల్యం నుంచి పిల్లలకు నైతిక, సామాజిక విలువలు నేర్పించాలి. దానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహించాల్సి ఉంటుంది. అప్పుడే మానవ విలువల పట్ల అవగాహన ఉంటుంది.
పరిమితితో.. పరిణతి లేమితో..
ఆర్ధిక పరిస్థితులో, అభివృద్ధి అనే భావనో మొత్తానికి ఉమ్మడి కుటుంబ స్థాయి పరిమిత కుటుంబాలకు చేరింది. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనుకుంటారుగానీ, పరిణతి లేమితో తీసుకునే నిర్ణయాలతో పరిస్థితులే మారిపోతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ఓర్పు నశిస్తుంది. తొందరపాటు పెళ్ళిళ్ళు, బాధ్యత లేని పిల్లల పెంపకం అనేక అనర్థాలకు దారితీస్తున్నాయి. ప్రేమ.. పెళ్ళి.. విడిపోవడం సాధారణ విషయంగా మారిపోయింది. అదేమంటే దానికి స్వేచ్ఛ అనే నేమ్‌ప్లేట్ తగిలించి, చేతులు దులుపుకుంటున్నారు. పెళ్ళి ఎంత ఈజీగా చేసుకుంటున్నారో అంతే త్వరగా విడిపోతున్న జంటలను నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇది వారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల భవిష్యత్తు దుర్భరంగా మారుతుంది. ఇదంతా పరిణతి లేకపోవడం, పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యం లేకపోవడం వల్లనే జరుగుతుంది.
స్వార్థపూరితంగా..
అదే ఆకర్షణతో, ఎలాంటి ఆలోచన లేకుండా, తమ స్వార్థం కోసం వినియోగించుకునే వాళ్లూ ఉన్నారు. అలాంటివాళ్లు వాళ్ళను వాళ్ళు మోసం చేసుకోవడమే కానీ, దాని వలన వారు సాధించేదేమీ ఉండదు. నైతిక విలువలకు తిలోదకాలిస్తారు. స్వలాభాపేక్షతో అనేక చిక్కుల్ని ఎదుర్కొంటారు. సృష్టిలో ప్రేమ ఒక్కటే తనకు మాత్రమే చెందినదిగా ఉంటుంది. మన మనసులోంచి పుడుతుంది. కాబట్టి దానిని ఇచ్చే హక్కే మనకు ఉంటుంది. బలవంతంగా.. ఉన్మాదంగా తీసుకోవాలని ప్రయత్నిస్తే వికటిస్తుంది. అది అసలు ప్రేమే కాదు.
వ్యాపార సరుకుగా..
నిజమైన ప్రేమకు కొలమానాలుండవు. ఇచ్చి పుచ్చుకునే వస్తువులకు ప్రాధాన్యత ఉండదు. ఇతరులతో పోల్చుకుని వాళ్ళంత గొప్ప కానుకలిచ్చుకుంటే.. నేనంతకంటే గొప్పదివ్వాలనే పోటీతత్వంలోకి ప్రేమ నెట్టబడిరది. దాంతో కృత్రిమత్వం చోటు చేసుకుంది. ప్రేమ విషయంలో నటనలు, రకరకాల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మానవ సంబంధాలు పలుచనై, ‘నేను’ అనే స్వార్థం మనిషిని ఆవహిస్తుంది. అదే భావం అనుబంధాలను, ఆప్యాయతలను సరుకులుగా మార్చేస్తుంది. వినిమయ సంస్కృతి అలవడుతోంది. ప్రేమ వ్యాపార సరుకుగా మారిన నేపథ్యంలో ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే వ్యాపార ప్రకటనలు గుప్తిస్తారు. గులాబీ పూల దగ్గర నుంచి దుస్తుల వరకూ ఒకటికాదు.. కీచైన్లు.. హెయిర్ క్లిప్స్, తలగడ ఇలా అది ఇదేమని అన్నీ హృదయాకారంలో తయారుచేసి, వాలెంటైన్స్ డే పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా వందల కోట్ల వ్యాపారం జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ మాయాజాలంలో కొట్టుకుపోయే వినమయ సంస్కృతి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా ఒక రోజనేదే సరికాదు. ప్రేమ అనంతమైనది.. అద్వితీయమైనది. ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా.. నిరంతరం కొనసాగాల్సింది.
ప్రేమకు పరిమితులా..
అంటే ‘ప్రేమ’ పరిమితమా.. ప్రమాదమా.. అనంతమా.. నిరంతరమా..నిరోధమా.. విరోధమా..? దీనిపై ఎన్నో భావాలు, భావావేశాలు, అభిప్రాయ భేదాలు అనాదిగా కొనసాగుతూనే ఉన్నాయి. ‘నిజమైన ప్రేమ’ను ఎవ్వరూ అడ్డుకోలేరు. దానికి పరిమితి లేదు. ప్రేమ మానసికమైనది. భౌతికంగా బహిర్గతం చేయనక్కర్లేదు. ఎవరికీ హాని చేయనంతవరకూ, ‘నేను’ కాదు ‘మనము’ అనే భావం ఉన్నంత వరకూ ప్రేమ అనంతమే.. నిరంతరమే విశృంఖలతను ప్రేమగా వక్రీకరిస్తే ప్రమాదమే మరి. దాని వెంటే నిరోధమూ అవసరమౌతుంది.
సామాజిక కట్టుబాట్లు..
రానురాను సామాజిక కట్టుబాట్లకు గురై ఒంటరిననే భావనకు లోనవుతున్నారు జనం. పిల్లలను బాల్యం నుంచే బాంధవ్యాలకు దూరంగా పెంచుతున్నారు. అభద్రతా భావంతో ప్రేమ స్థానంలో కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. అది తర్వాత వికృత రూపం దాలుస్తోంది. ఒక వ్యక్తి మీద ఇష్టం కలిగితే అదే ప్రేమనుకోవడం.. ఇంట్లో పొందలేని స్థితిలో ఎవరైనా కాసింత ప్రేమ చూపించగానే అదే ప్రేమని భ్రమపడటం జరుగుతోంది. తాను ప్రేమించే వ్యక్తికి ఆ భావన లేదనడంతోనే చనిపోవడం.. లేదా చంపడం.. పరిపాటి అయిపోయింది. వారికి కావాలనుకున్నది పొందడానికి అవతలి వ్యక్తి గుర్తించి కనీసపు ఆలోచనను విస్మరించడమే. స్త్రీని వస్తువుగా చూసే దృక్పథం నుంచే ఇలాంటి భావనకు గురికావడం. ఆమె కూడా మనిషేననే వాస్తవాన్ని తెలుసుకొని మసలుకోవాలి.
అంతరాలు.. అవాంతరాలు..
ప్రేమకు అనాది నుంచీ అంతరాలు, అవాంతరాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. సామాజిక,ఆర్ధిక అవాంతరాలు వికటించి హత్యలు, హింస రూపంలో సమాజంలో జుగుప్సాకరమైన పరిస్థితులు నెలకొల్పుతున్నాయి. దాంతో జీవితాంతం ఆ కుటుంబం బాధ పడటం తప్పించి వేరే ప్రయోజనం ఉండదు. 21వ శతాబ్దంలోనూ పేద-గొప్ప, ఉన్నత-నిమ్న, తెలుపు-నలుపు అంతరాల మధ్య కొట్టుమిట్టాడటం, కొట్లాటలు జరగటం ఈ అంతరాలకు చిహ్నాలే.
పెంపక లోపాలు..
ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ అందరిలో ముందుండాలని అనుకోవడం, బాగా సంపాదించాలనుకోవడం వరకే ఆలోచిస్తున్నారు. కానీ వారి శక్తియుక్తుల గురించి ఆలోచించడం లేదు. సామాజిక పరిస్థితుల గురించి ఆలోచించడం లేదు. అందరితో మంచిగా ఉండాలనుకోవడం లేదు. సమాజానికి ఎంత వరకు ఉపయోగపడతారని చూడడం లేదు. మనం సమాజంలోనే ఉంటాం. కానీ సమాజం గురించి ఆలోచించం. పిల్లలను ఆలోచించనివ్వం. ఎవరితో కలవనివ్వం. ఎవరినీ ‘మన’ అనుకోనివ్వం. కలవారి తనానికి లోబడి, కలుషిత స్నేహాలకు నాంది పలుకుతాం. స్వార్థ ప్రేమను స్వాగతిస్తాం. ‘నా’ అని గిరిగీసుకుని పెంచుతాం. ఆ ‘నా’లో ప్రేమకు స్థానముండదు స్వార్థం తప్ప.
విద్వేషం వెదజల్లుతూ..
ఒకవైపు వినిమయ సంస్కృతిని ప్రోత్సహిస్తూ.. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ.. ధనవంతుల్ని మరింత ధనువంతుల్ని చేస్తున్నారు. వారిని అడ్డుకోవడమనే ఆలోచనే చేయరు. మరోవైపు ప్రేమికుల రోజు విదేశీ సంస్కృతి అంటూ.. మన సాంప్రదాయం కాదంటూ.. సాంప్రదాయ ముసుగు వేసుకున్న హిందూత్వ సంస్కృతికి తెరలేపుతున్నారు. ప్రేమికుల రోజు నిర్బంధపు పెళ్ళిళ్ళు చేయడానికి పూనుకుంటున్నారు. ఈసారి మరో విపరీతాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ వాలెంటైన్స్ డేని ‘కౌ హగ్ డే’గా నిర్వహించాలని ఏకంగా పాలకులే పిలుపునిచ్చారు. మొదటి నుంచి స్త్రీ కన్నా ఆవుకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చే ఈ సంస్కృతిని ఏమనాలి? ఏవిధంగా అర్థం చేసుకోవాలి? జంతువుల్నీ ప్రేమించాలి. కానీ మనుషుల స్థానంలో వాటిని అంటే.. ఈ ప్రేమించే తత్వాన్ని చెరిపేసే విద్వేషపు ఆలోచనలకు చరమగీతం పాడాల్సిందే.
భారతదేశం…విదేశాలలో..
–మనదేశంలో : మనదేశంలో 20-30 ఏళ్లుగా ప్రేమికుల రోజును జరుపుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్యతో పాటు పాశ్చాత్య సంస్కృతిని నిషేధించాలనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంగ్లీష్ ప్రధాన భాషగా చలామణిలో ఉన్న అన్ని దేశాల్లో ప్రేమికుల దినోత్సవాన సెలవు ఇచ్చే విధానం ఉంది. మనదేశంలో అలా లేదు.
ఇటలీలో.. :
ఇటలీలో ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం మొట్టమొదటిసారి చూసిన వ్యక్తే తమ జీవిత భాగస్వామిగా మారతారనే భావన ఉంది. అలా కనిపించిన వారితో తర్వాతి ప్రేమికుల దినోత్సవానికి వివాహం కూడా అయిపోతుందని నమ్మకం.
జర్మనీలో.. :
జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ లేదా పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. దీంతో వాలెంటైన్ డేకు ముందు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్ పెరుగుతుంది.
అర్జెంటీనాలో.. :
అందరికీ ప్రేమికుల రోజు ఉంటే అర్జెంటీనా వాసులకు ప్రేమికుల వారం ఉంది. ఆ దేశంలో జూలై 13 నుంచి 20వ తేదీ వరకూ వారం పాటు వాలెంటైన్ వీక్‌గా జరుపుకొంటారు.
కొరియాలో.. :
కొరియాలో రెండు సంప్రదాయాలున్నాయి. ఏప్రిల్ 14ను వైట్ డేగా భావిస్తూ ఓ పక్క ప్రేమికులు ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. మరోపక్క ప్రేమలో పడనివారు ఇదేరోజును బ్లాక్ డేగా భావిస్తూ నల్లటి దుస్తులు ధరిస్తారు.
-జపాన్‌లో.. : జపాన్‌లో వాలెంటైన్స్ డేన ప్రేమికులు బహుమతులుగా చాక్లెట్లను ఇచ్చుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా చాకెట్లు తయారుచేస్తారు. ఇలా చాక్లెట్లు బహుమతిగా అందుకున్న వారు నెల తర్వాత అవతలి వారికి చాక్లెట్లతో పాటు బహుమతులనూ అందజేస్తారు.
పక్షుల కోసం :
ఫిబ్రవరిలో పక్షులు తమ జంటల కోసం ఎక్కువగా వెతుకుతాయి. కాబట్టి పక్షులూ ప్రేమను తెలుపుకొంటాయనే ఆలోచనతో ఈ రోజును ఎంపిక చేశారు.
గ్రేట్ గ్రీటింగ్:
అమెరికా, డెన్మార్క్, యూకే, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో వాలెంటైన్స్ డేను పెద్ద పండుగలా చేస్తారు. క్రిస్మస్ తర్వాత ఎక్కువగా గ్రీటింగ్స్ పంచుకునే రోజుగా వాలెంటైన్స్ డే గుర్తింపు పొందింది. ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రీటింగులు అమ్ముడవుతాయని అంచనా.
ప్రేమకు అడ్రెస్:
ప్రేమికుల రోజున ధరించే డ్రెస్ కూడా ఒక సందేశాన్ని పంపుతుంది. ఆ సందేశా న్ని పసిగట్టేలా రంగులకూ కొన్ని అర్థాలు ఏర్పాటు చేసుకున్నారు.
పింక్ : గోయింగ్ టు ప్రపోజ్
బ్లూ : వెలకమ్ ఫర్ అప్లికేషన్స్
ఆరెంజ్ : ఆల్రెడీ ఇన్ లవ్
బ్లాక్ : నాట్ ఇంట్రస్టెడ్
ఎల్లో : లవ్ ఫెయిల్యూర్
గ్రీన్ : లవ్ యాక్సెప్టెడ్
వైట్ : డబుల్ సైడ్
ఏడు రోజుల పండగ
వాలెంటైన్స్ వీక్‌లో మొదటి రోజైన ఫిబ్రవరి ఏడును రోజ్ డేగా ప్రేమికులు భావిస్తారు. తమ అనుబంధాన్ని పెంచుకోవడం కోసం గులాబీలను అందజేస్తారు. ఇష్టపడిన వారికి మొదటిసారి ప్రపోజ్ చేయడం కోసం ఫిబ్రవరి ఎనిమిదిని ప్రపోజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమ బంధం ఎప్పటికీ తీయగా ఉండాలనే ఉద్దేశంతో ప్రేమికులు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. అందుకోసం ఫిబ్రవరి తొమ్మిదిని చాక్లెట్ డేగా జరుపుకొంటారు.బహుమతులెన్నున్నా అమ్మాయిలు టెడ్డీబేర్లను బాగా ఇష్టపడతారు. టెడ్డీని బహుమతిగా ఇవ్వడం ద్వారా తామెప్పుడూ ప్రేయసి వెన్నంటే ఉన్న భావన కలిగించవచ్చు. అందుకోసం ఫిబ్రవరి 10ని టెడ్డీ డేగా జరుపుకొంటారు. నమ్మకానికి గుర్తుగా ప్రామిస్ చేసుకుంటారు. అదే ఫిబ్రవరి 11న ప్రామిస్ డేగా ఎన్ని కష్టాలొచ్చినా విడిపోకూడదనే ఉద్దేశంతో జరుపుకొంటారు. ప్రేమికులు తమప్రేమను ముద్దు ద్వారా తెలియపరుచుకునే రోజు ఫిబ్రవరి 12. దీన్నే కిస్డేగా వ్యవహరిస్తారు.ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ ప్రేమను పంచుకునే రోజు హగ్ డే. ఫిబ్రవరి 13ను హగ్ డేగా జరుపుకొంటారు.వీటన్నింటిని ఒక్క రోజులోకి మార్చితే ఫిబ్రవరి 14..అదే ప్రేమ పండగ. ప్రేమికుల దినోత్సవం అంటారు.
………………………………………………..