
* భక్తులకు ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం
* రాబోయే జాతరకు నిధుల పెంపునకు కృషి చేస్తా
* మంత్రి దనసరి అనసూయ సీతక్క
ఆకేరున్యూస్, భూపాలపల్లి: అన్ని వర్గాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే వనదేవతల జాతరల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మేడారం మినీ జాతరలో బాగంగా శుక్రవారం కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ, కొండాయి మండలంలోని గోవిందరాజులు నాగులమ్మ, సారలమ్మ జాతరలకు మంత్రి హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వన దేవతలగా కొలువబడే సమ్మక్క సారలమ్మల దీవెనలు రాష్ట్ర ప్రజలపై, ప్రజాప్రభుత్వంపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ అని ఈ జాతరల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మేడారం మినీ జాతర, కొండాయి, ఐలాపూర్, బయ్యక్కపేటలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె వివరించారు. రాబోయే జాతరకు నిధులు పెంచే విధంగా తనవంతు కృషి చేస్తానని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మరిన్ని ఏర్పాట్లు చేస్తామని ఆమె తెలిపారు.
……………………………………………….