
* భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఆకేరున్యూస్, భూపాలపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. శనివారం చిట్యాల, టేకుమట్ల మండల కేంద్రాలలో మండల అధ్యక్షులు గూట్ల.తిరుపతి, కోటగిరి సతీష్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డితో కలిసి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పూర్తి చేసిందన్నారు. దీనితో పాటు ఎస్సి వర్గీకరణపై అసెంబ్లీ లో తీర్మానం చేసిన నిర్ణయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలి అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. మండలాలలోని నాయకులు పాత, కొత్త అనే అభిప్రాయం లేకుండా సమన్వయంతో పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. గ్రామాల్లోని గ్రామ కమిటీలు, మండల కమిటీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
…………………………………..