
* భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: ప్రధానమంత్రి శ్రీ పథకానికి ఎంపిక చేసిన పాఠశాలల్లో సదుపాయాలు కల్పన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖ అధికారులతో పిఎం శ్రీ నిధులు వినియోగం, సమగ్ర శిక్షా నిధులు ఖర్చులు, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధన, ఆపార్ నమోదు, డిఎస్సీ 2008 అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం క్రింద జిల్లాలోని టీఎస్ ఎంఎస్ మల్హర్, జడ్పిహెచ్ఎస్ టేకుమట్ల,కాళేశ్వరం, గొల్లబుద్దారం, చెల్పూర్, టీఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఎస్ చిట్యాల, టిఎస్ ఎంఎస్ ఘన్పూర్, ఎంపిపిఎస్ యమన్పల్లి పాఠశాలలు ఎంపిక చేసినట్లు తెలిపారు. పీఎం శ్రీలో ఎంపిక చేసిన ఎనిమిది పాఠశాలలకు 73,76,640 రూపాయల నిధులు మంజూరు కాగా ఇప్పటి వరకు 49,29,356 రూపాయలు ఖర్చు చేశారని, మిగిలిన నిధులలో నిర్దేశించిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దశలో మంజూరు చేసిన నిధులు వినియోగం అయితేనే రెండో విడత నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. పిఎం శ్రీ నిధుల పర్యవేక్షణకు ఎం ఈ ఓ లు నోడల్ అధికారులుగా వ్యవహరించాలని, ఆయా పాఠశాలల్లో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. పాఠశాలలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు, కంపోస్టు, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహణ, సోలార్ విద్యుత్తు, గ్రీన్ పాఠశాలలు, ఏకో పార్కు, చారిత్రక ప్రాంతాలకు విద్యార్థులకు విజ్ఞాన, విహార యాత్రలు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు వివిధ అంశాలలలో క్రీడలు, వ్యాసరచన వంటి పోటీలు నిర్బహించి బహుమతులు అందచేయాలని సూచించారు. పిఎం శ్రీ నిధులతో చేపట్టిన కార్యక్రమాలతో డాక్యూమెంట్ తయారు చేయాలని అన్నారు. బాలికలకు స్వీయ రక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలన్నారు.
………………………………….