
* పొలిటికల్ టర్న్ తీసుకున్న హత్య
* కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు
* తీవ్రస్థాయిలో స్పందిస్తున్న నేతలు
* కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించండి : కోమటిరెడ్డి
* హత్యను బీఆర్ ఎస్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు
* నేనే చంపించానని ఎలా చెబుతున్నారు : గండ్ర
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాలను కుదిపేసిన ఘటన మేడిగడ్డ కుంగడం. ఇది రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. బీఆర్ ఎస్ అధికారం కోల్పోవడం వెనుక ఇదీ ఓ కారణంగా విశ్లేషకులు భావిస్తారు. కేసీఆర్ కుటుంబం (KCr Family)అవినీతికి ఇది నిదర్శనంగా ప్రచారం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడి కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్మాణం చేయడంతోనే కుంగిందని కాంగ్రెస్ పేర్కొంది. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఎన్నికల్లో ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ సర్కారు విచారణకు ఆదేశించింది. ఇదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి (47) న్యాయస్థానంలో కేసు వేశారు. ఆ లింగమూర్తి ఇప్పుడు హత్యకు గురికావడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.
ప్రభుత్వం సీరియస్
లింగ్మూర్తి దారుణ హత్యను తెలంగాణ సర్కారు సీరియస్‌గా తీసుకుంది. గత ప్రభుత్వ అవినీతిపై కేసు వేసిన వ్యక్తి హత్యకు కారణాలను తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో నేరుగా సీఎంఓనే విచారణ చేపడుతోంది. నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఇదిలాఉండగా దీనిపై మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండించారు. గండ్ర వెంకట్రమణారెడ్డే చంపించాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారని తెలిపారు. కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణను దోచుకున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీపై లింగమూర్తి పోరాడారని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం అక్రమాలను బయటపడితే చంపేస్తారా.. అని ప్రశ్నించారు. న్యాయపరంగా కొట్లాడాలి కానీ, చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని ప్రకటించారు. కేసీఆర్‌పై న్యాయ పోరాటం చేస్తున్న చక్రధర్ గౌడ్‌కు రక్షణ కల్పిస్తామన్నారు. కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉన్నవారు తమ ప్రభుత్వాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. లింగమూర్తి హత్యకు, బీఆర్ ఎస్‌కు సంబంధం ఉన్నట్లుగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉండడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
హత్యా రాజకీయాలు బీఆర్ ఎస్ చేయదు : గండ్ర
మరోవైపు కోమటిరెడ్డి ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజలింగమూర్తి కుటుంబీకులు, కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (Gandra Venkataramana Reddy) స్పందించారు. లింగమూర్తి హత్యకు ఖండిస్తున్నానని చెప్పారు. ఆయన హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి ఆరోపణల వెనుక హత్య కేసును ప్రభావితం చేసే ఆలోచన కనిపిస్తోందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. హత్యా రాజకీయాలను బీఆర్ఎస్ చేయదన్నారు. ఏ ఆధారాలు లేకుండా హరీశ్‌రావు, తానే చంపించారని ఆయన ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లింగమూర్తి హత్య చుట్టూ మాటల తూటాలు పేలుతుండడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
………………………………….