
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రేవంత్ సర్కారుకి చేతకాకపోతే మేము వస్తాం.. ఢల్లీికి పోదాం. ధర్నా చేద్దాం.. పదండి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సాగు, తాగు నీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సోయి లేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అర్థం అవుతోంది. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్లు నములుతున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ భూములకు నీరు పారిస్తే కాంగ్రెస్ నీళ్లు నములుతోంది. సాగర్ కుడి కాల్వ నుంచి రోజూ పది వేల క్యూసెక్కులు మూడు నెలలుగా పోతున్నా పట్టించుకోవడం లేదు. తాత్కాలిక వాటా అయినా 512 టీఎంసీలకు మించి 657 టీఎంసీలు తీసుకుపోయింది. 25 రోజుల్లోనే 65 టీఎంసీల నీటిని తరలించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణకు పెనుశాపంగా మారింది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ కేంద్ర బలగాల చేతిలో ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి లేకుండా ఏపీ ఇష్టారీతిన నీటిని తరలించుకుపోతోంది. కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదు, చంద్రబాబును అడిగే దమ్ము లేదు. ప్రతిపక్షాలను బాగా విమర్శిస్తారు కానీ, కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదు. శ్రీశైలం, సాగర్ నీటిని తరలించుకుపోతుంటే కనీసం స్పందించడం లేదు. 1015 టీఎంసీల నీరు కృష్ణాలో ఈ ఏడాది వచ్చింది. ఏపీకి కేవలం 9 టీఎంసీల హక్కు మాత్రం ఉంది. ఇవాళ కూడా ఏపీకి నీరు తరలిస్తూనే ఉన్నారు. 220 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాడుకుంది. ఇంకా 123 టీఎంసీలు రావాలి. తెలంగాణ ఇప్పటికే నష్టపోయింది. ఇప్పటికైనా కళ్లు తెరవాలి అని హరీశ్‌రావు సూచించారు. యాసంగి పంట కింద ఎన్ని ఎకరాలకు నీరు ఇస్తారో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. ఆరున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలు ఏసుకున్నారు, సాగర్ ఎడమకాల్వకు ఇంకా నాలుగు తడులు కావాలి. హైదరాబాద్ సహా చాలా జిల్లాల తాగునీటి అవసరాలు ఉన్నాయి. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏపీకి నీరు ఆపేలా చూడండి. కృష్ణా బోర్డు కార్యాలయం ముందు, దిల్లీలో ధర్నా చేద్దాం.. మేమూ వస్తాం. సాగర్ కుడి కాల్వ, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు నుంచి నీరు వెళ్లకుండా అడ్డుకోవాలి. నీటి తరలింపు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది కాబట్టే ఏపీ ఇష్టం వచ్చినట్లు నీటిని తరలించుకుపోతోంది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
…………………………………..