
* నీటి సరఫరాకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలి
* అధికారుల రివ్యూ మీటింగ్లో కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: రబీ పంటకు అవసరమైన నీటి సరఫరా కోసం తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో రబీలో సాగునీటి సౌకర్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ పంటకు అవసరమైన నీటి సరఫరా కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంటలకు సమృద్ధిగా సమయానికి సాగు నీరు అందించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నీటి పరిస్థితి, కాలువల ద్వారా నీటి సరఫరా, భూగర్భ జలాల స్థితిగతులు మొదలైన అంశాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటూ పంటలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతుల సాగునీటి అవసరాలను గుర్తించి తక్షణ ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎస్ఆర్ఎస్పి నుండి సరఫరా అయ్యే నీటి విడుదల వల్ల రేగొండ, చిట్యాల మండలాల రైతులకు మేలుజరుగుతుందని తెలిపారు. వ్యవసాయ ఇరిగేషన్ శాఖల అధికారు లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వ్యత్యాసం లేకుండా సాగు వాస్తవ నివేదికలు అందించేయాలని పేర్కొన్నారు. జిల్లాలో గత రబీ సీజన్లో 86 వేల ఎకరాలలో పంట సాగు జరిగిందని, ఈ రబీ సీజన్లో 82 వేల ఎకరాలలో సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు. గత సంవత్సరం నీరందక పంటలు ఎండిపోయిన ప్రాంతాలను, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యాన్మయ ఏర్పాట్లుపై రైతులకు అవగాహన కల్పించాలని..అందుబాటులో వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అక్రమ నీటి వినియోగాన్ని అరికట్టేందుకు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
యూరియా కొరత రాకుండా చూడాలి
యూరియా కొరత రాకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ టీములు ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తూ స్టాకు వివరాలు పరిశీలించాలని ఆదేశించారు. వ్యాపారులు ఎరువులు నిల్వ వివరాలు నోటీస్ బోర్డ్ పై ప్రదర్శించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తామని ఏదేని వ్యత్యాసం వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు 25 వేల టన్నుల యూరియా వచ్చిందని, అదనంగా 5 వేలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా యూరియా సరఫరా చేయాలని తెలిపారు. ఆధార్ నమోదుతో మాత్రమే యూరియా ఇవ్వాలని తెలిపారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే పిడి యాక్టు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
………………………………………….