
* ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు
* నేడు మహాశివరాత్రి పర్వదినం
* దేశంలో అతిపెద్ద విగ్రహాలు ఎక్కడున్నాయంటే..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
హిందువుల ప్రధాన పండుగల్లో మహాశివరాత్రి ప్రశస్తమైనది. చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వచ్చే ఈ పండుగను చాలా భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైన వేళను శివరాత్రిగా పండితులు చెబుతున్నారు. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. ఈ శివరాత్రి పర్వదినం రోజున ఆధ్మాత్మిక చింతనలో గడిపేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఆలయాల్లోనూ తగిన ఏర్పాట్లు చేశారు.
మహా మృత్యుంజయ ఆలయం
శైవక్షేత్రాలు ఏటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అస్సోంలోని మహా మృత్యుంజయ ఆలయం విశిష్ఠ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. దేశంలోని అస్సోం నాగావ్‌లో ఉన్న శివాలయం నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఇక్కడ ఆలయం కూడా శివలింగం రూపంలో ఉంటుంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంలో ఒకటిగా చెబుతారు. ఇక్కడ శివలింగం 126 అడుగుల ఎత్తులో ఉంటుంది. 2003 లోనే నిర్మించాలని ఆచార్య భృగు గిరి మహారాజ్ సంకల్పించారు. ఈ ప్రదేశంలో ఆయన ధ్యానం చేసేవారట. గురు, శుక్రాచార్య మహా మృత్యుంజయ మంత్రాన్ని ఇక్కడే పటించేవారట. అందుకే ఈ ఆలయానికి మహా మృత్యుంజయ ఆలయంగా పేరొచ్చింది. అయితే పలు కారణాల వల్ల ఆలయ నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. తుది ఇంజనీరింగ్, డిజైన్ పనిని నారాయణ్ శర్మ నిర్వహించారు. ఇంజనీరింగ్‌లో నైపుణ్యానికి ఈ ఆలయం అద్భుత నిదర్శనంగా నిలుస్తుంది. 2021 ఫిబ్రవరి 26 నుంచి ఇక్కడి శివుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
దేశంలో అతిపెద్ద పరమ శివుడి విగ్రహాలు ఎక్కడున్నాయంటే..
* రాజస్థాన్‌లోని నార్ద్వార్లో 351 అడుగులు మహా శివుడి అతిపెద్ద విగ్రహం ఉంది. చుట్టూ పచ్చటి కొండల మధ్య ఇత్తడితో రూపొందించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహంగా ఖ్యాతి పొందింది.
* కర్ణాటకలోని మురుదేశ్వర్లో కొలువైన శివుడి విగ్రహం ఎత్తు 123 అడుగులు.
* గుజరాత్‌లోని వడోదరలో మహాదేవుని విగ్రహం ఎత్తు 120 అడుగులు.
* తమిళనాడులోని కోయంబత్తూరులో ఆది యోగి రూపంలో కొలువైన ఉన్న ఈశ్వరుడి విగ్రహం ఎత్తు 112 అడుగులు.
* సిక్కింలోని నామ్చిలో ఉన్న పరమ శివుడి విగ్రహం ఎత్తు 108 అడుగులు.
* ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో శివుడి విగ్రహం ఎత్తు 100.1 అడుగులు.
* దేశంలోని 12 జ్యితిర్లింగాలలో ఒకటిగా ఉన్న గుజరాత్ ద్వారకలోని నాగేశ్వర ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న మహా శివుడి విగ్రహం ఎత్తు 88 అడుగులు.
…………………………………….