
-పాలమూరు ద్రోహి, దుర్మార్గుడు కేసీఆర్
-పాలమూరు ప్రజలకు పరీక్ష పెట్టొద్దు.. కర్రు కాల్చి వాత పెడ్తారు
-ప్రజల్లో గౌరవం పెరగాలంటే పనిచేసి చూపించాలి
-వనపర్తి ప్రజాపాలన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఆకేరున్యూస్, వనపర్తి: పాలమూరు జిల్లాలో ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా వారి బిడ్డగా వారి రుణం తీర్చుకుంటానని, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ పాలమూరుకు ద్రోహం చేసిన దుర్మార్గుడని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ప్రజల నుద్దేశించి మాట్లాడారు. పాలమూరు ప్రజలు ఎంతో మంచి వారని వారికి పరీక్ష పెట్టొద్దని వారికి కోపం వస్తే కర్రు కాల్చి వాత పెడతారని కేసీఆర్ కు చురకలంటించారు. ప్రజల్లో గౌరవం పెరగాలంటే పనిచేసే చూపించాలని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని కోరారు. వనపర్తిలో చిన్నప్పుడు పాఠశాల, జూనియర్ కళాశాలలో చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకున్నానని, వనపర్తి నాకు సంస్కారాన్ని నేర్పిందని, వనపర్తితో నాకు చాలా అనుబంధం ఉన్నదని, ఈ అనుబంధాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకుని వనపర్తికి కీర్తి తెస్తానని, రాజకీయాల్లో నేను రాణించడంలో వనపర్తి పాత్ర ఉందని చెప్పారు. వనపర్తి ప్రాంతంలో ఎన్నటికీ తెగిపోని బంధం నాది వనపర్తి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. వనపర్తిలో అనేక విద్యాసంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే పునాది వేశాయని, వనపర్తిలో నేను నేర్చుకున్న రాజకీయ చైతన్యంతోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డానని చెప్పారు. బీఆర్ఎస్ బిజెపి ఒక్కటే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని, దీన్ని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్లకు పైగా పెరిగిన ఎక్కడ విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నామని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ తీస్తున్నామని చెప్పారు. హైటెక్ సిటీ శిల్పారామం పక్కనే స్వయం సహాయక మహిళల కోసం 150 స్టాల్స్ ఏర్పాటు చేశామని, ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థల పక్కనే మహిళా సంఘాలకు మూడున్నర ఎకరాల స్థలం ఇస్తారని ఎప్పుడైనా ఊహించారా అన్నారు. ఆదాని అంబానీ లే కాదు స్వయం సహాయక మహిళలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని, వెయ్యి బస్సులను స్వయం సహాయక మహిళలతో కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేశామన్నారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో ఇస్తున్నామని, ఇందిరమ్మ రాజ్యంలో మొదటి ఏడాదిలోనే 55,163 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు, 35వేల టీచర్లకు బదిలీలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేశామని, పదేళ్లపాటు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని ప్రజల గురించి ఆలోచించలేదని ఎద్దేవా చేశారు. వనపర్తికి మాజీ ఎమ్మెల్యేలు జయరాములు, బాలకృష్ణయ్య, చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధిలో పోటీపడ్డారని, కానీ గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న వ్యక్తి రాజకీయాలను కలుషితం చేసి కుళ్ళు, కుతంత్రాలు, డబ్బులతో రాజకీయం చేసి కక్షలు పెంచారని పరోక్షంగా నిరంజన్ రెడ్డి పై ఆయన మండిపడ్డారు. కాశీంనగర్ ఎత్తిపోతల పథకం కావాలని చిన్నారెడ్డి కోరారని, ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తూ లిఫ్ట్ కు అతని అన్న డాక్టర్ మాధవరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. దీంతోపాటు ఇతర భవనాలకు డాక్టర్ బాలకృష్ణయ్య, జయరాములు పేర్లను కూడా పెడుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, బిజెపి పార్టీలు రైతులను ఆగం చేశాయని,రూ.7625 కోట్లు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, ఇది నిజమని రైతులు అనుకుంటే బీఆర్ఎస్, బిజెపి నాయకులను తరిమికొట్టాలని కోరారు. 50 లక్షల కుటుంబాలకు సిలిండర్లు రూ.500 కే సబ్సిడీ కింద అందజేయడం జరుగుతున్నదని, అన్ని రంగాల్లో మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో తిరిగేందుకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించామని, ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 4500 కోట్లు చెల్లించిందన్నారు. బీఆర్ఎస్ హయంలో మహిళా సంఘాలకు గ్రహణం పట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి సీతక్క నాయకత్వంలో రూ.1000 కోట్ల లోన్లు ఇచ్చామని, 67 లక్షల మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించడం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల బట్టలు కుట్టే పని కూడా మహిళలకు అప్పగించడం జరిగిందని గుర్తు చేశారు. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉండి ఒక ఉద్యోగమైన కేసీఆర్ ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లలో పాలమూరును ఎందుకు పూర్తి చేయలేదని బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎందుకు పూర్తి చేయలేదని, ఆర్డీఎస్ ఎందుకు ఎండిపోయిందని ఆయన ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ పదేళ్లపాటు పడావు పెట్టడంతో కుప్పకూలిపోయింది.. ఈ పాపం కేసిఆర్ ది కాదా అని ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్ళు రాయలసీమకు నీళ్లు తరలించుకొని పోతుంటే గుడ్లప్పగించి కేసీఆర్ చూడలేదా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమని బీఆర్ఎస్ సన్నాసులు అంటున్నారు.. పదేళ్లపాటు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వలేక పోతున్నారని అన్నారు. పాలమూరు బిడ్డకు పరిపాలించే శక్తి లేదా.. పాలమూరు వాళ్లది అమాయకత్వం కాదు.. మంచితనం తిక్క రేగితే డొక్క చీల్చి డోలు కడతాం జాగ్రత్త అని కేసీఆర్ నువ్వు చెప్పే హరికథలు పిట్టకథలు నడవవని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోదింది పాలమూరు బిడ్డ జిల్లెల చిన్నారెడ్డి అని గుర్తు చేశారు.పదేళ్లు పరిపాలించి పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని, దీనివల్ల పాలమూరు జిల్లా ప్రజలు వలసలు వెళ్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు మంత్రి రోజా ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని కేసీఆర్ మాటిచ్చారని, పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు ఎండబెట్టారని ఆయన ప్రశ్నించారు. మెట్రో విస్తరణ అనుమతులు, మూసీ నది ప్రక్షాళనకు నిధులు, రీజనల్ రింగ్ రోడ్డు అనుమతులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు, కాలేశ్వరానికి నీటి కేటాయింపులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నాడని, తెలంగాణ కు ఏదైనా వస్తే తన ఖాతాలో కిషన్ రెడ్డి వేసుకుంటున్నాడని విమర్శించారు. 12 ఏళ్ల పరిపాలనలో మోడీ 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో కిషన్ రెడ్డి లెక్క పెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మోదీ రెండు బోడి ఉద్యోగాలు ఇచ్చాడు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి పదవులు అని ఆయన అన్నారు. సికింద్రాబాద్ లో వరదలు వచ్చి కొట్టుకుపోతే కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని, కిషన్ రెడ్డి కడుపునిండా అసూయ, కుళ్ళు పెట్టుకొని కాళ్లల్లో కట్టెలు పెడుతున్నాడని, హైదరాబాద్ కు కేంద్ర మంత్రి వచ్చి సమీక్ష చేస్తే కిషన్ రెడ్డి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి కావలసిన ప్రాజెక్టులు, నిధుల పైన అన్ని పార్టీల ఎంపీలతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహిస్తారని, అందరం కలిసి కేంద్రం దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి కావలసిన నిధులు అడుగుదామని చెప్పారు. కేంద్రం నుండి నిధులు తేవడంలో కిషన్ రెడ్డి విఫలం చెందారని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేను కలిసి వరంగల్ కు విమానాశ్రయం తెస్తే నేనే తెచ్చానని కిషన్ రెడ్డి అంటున్నాడని, మేము తెచ్చింది తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నాడని, ఆయన తెచ్చింది ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించారని, ఆ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బిల్డర్ తిరుమల మహేష్ పాల్గొన్నారు.
……………………………………………………………..