
* తల పట్టుకుంటున్న అధికారులు
* ఆదిలోనే అడ్డంకులు.. భూసేకరణకు ముందుకు రాని స్థానికులు
* పరిహారంపై పలు ప్రశ్నలు
* ఆ ఎకరాలు సేకరిస్తేనే వడివడిగా అభివృద్ధి పనులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : వరంగల్ జిల్లా భవితవ్యం మార్చే బృహత్తర కార్యక్రమం.. మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం. ఇటీవలే ఎయిర్ పోర్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా సంబరాల్లో మునిగిపోయారు. ఇక నిర్మాణ పనులు ఊపందుకుంటాయని అందరూ భావించారు. ఈ ఏడాదిలోనే ఎయిర్ పోర్టును ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రకటన మరింత ఉత్సాహాన్ని నింపింది. తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో భూసేకరణ సర్వేకు వెళ్లిన అధికారులకు చుక్కెదురైంది. స్థానిక రైతులు సర్వేను అడ్డుకోవడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో అనుకున్న సమయానికి భూసేకరణ జరిపి.. ఎయిర్ పోర్టును అందుబాటులోకి అందుబాటులోకి తేవడం అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకూ అందుకే ఆలస్యం
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు 2007లోనే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. అయితే పలు కారణాలతో పూర్తి స్తాయిలో అనుమతులకు ఆలస్యం అవుతూ వచ్చింది. నిజాంల కాలంలోనే విమాన సేవలను అందించిన ఈ ఎయిర్ పోర్టు లో ప్రస్తుతం ఉన్న రెండు రన్ వేలు కూడా ఉపయోగించుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ రన్ వే మార్గాలు కూడా కేవలం 1800 మీటర్ల పొడవు మాత్రమే ఉన్నాయి. కానీ ఎంత చిన్న విమానాలకైనా కనీసం 2800 మీటర్ల రన్ వే అవసరం అవుతుంది. ఆ రన్ వే మార్గాలను విస్తరించాలంటే అదనంగా మరింత భూమి అవసరం అవుతోంది. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ వద్ద ఎయిర్ పోర్ట్ అథారిటికి 696 ఎకరాల భూమి ఇప్పటికే ఉంది. రన్ వేల అభివృద్ధి ఇతర అవసరాల కోసం అదనంగా 280 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎయిర్ పోర్టు ఆలస్యం కావడానికి భూసేకరణ ఒక కారణం కాగా, జీఎంఆర్ తో ఒప్పందం రెండో కారణం. తాజాగా కేంద్రమే చొరవ తీసుకుని జీఎంఆర్ను ఒప్పించి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్ ఓసీ తీసుకోవడంతో మార్గం సుగమమైంది.
మెరుగైన పరిహారం కోసం పట్టు
ఎయిర్ పోర్టు నిర్మాణంలో కీలకమైన భూ సేకరణ బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉంది. ఇందుకోసం నవంబరులో 205 కోట్లు మంజూరు చేసింది. ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్టు సమీప ప్రాంతాలైన నక్కలపల్లి, గుంటూరు పల్లి, గాడిపల్లి గ్రామాల్లోని 223 మంది రైతుల నుంచి 253 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. ఆయా ప్రాంతాల్లో భూసేకరణ కోసం సర్కారు విశ్వ ప్రయత్నాలు ముమ్మురం చేసింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో వేగవంతం చేసింది. అయితే, తాజాగా రైతులు మెరుగైన పరిహారం కోసం పట్టుబడుతుండడంతో సేకరణ క్లిష్టతరంగా మారింది. సర్వే కోసం వెళ్లిన అధికారులను తాజాగా భూ నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. గుంటూరు పల్లె వద్ద భూములు కోల్పోతున్న రైతులు వరంగల్ – నెక్కొండ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణంలో రెండు గ్రామాలను కలిపే రోడ్డును తాము కోల్పోతున్నామని, తమకు కొత్త రోడ్డు నిర్మించి బాధితులకు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సర్కారు 95 లక్షలు.. రైతులు 2 కోట్లు!
ఎయిర్ పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.95 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాధిత రైతులు మాత్రం మార్కెట్ రేటు ప్రకారం ఎకరాకు రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, రైతుల మధ్య పరిహారం విలువలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈక్రమంలోనే సర్వేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే పరిహారంపై స్పష్టత వచ్చే వరకూ ఎయిర్ పోర్టు నిర్మాణం అంత ఈజీగా అయ్యేలా కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది.
………………………………………….