
* భూపాలపలి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే
ఆకేరున్యూస్, భూపాలపల్లి: ఆధునిక సమాజంలో మహిళలు సాధికారత సాధించాలంటే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. ఈ నెల 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీసులకు, భరోసా, సఖి, సిబ్బందికి ఎస్పి సన్మానించారు. ఈ సంధర్బంగా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ మాట్లాడుతూ మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని, వారు ఏదైనా సాధించగలరని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలు వివిధ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని, మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పని చేయాలని, తమ కలల సాకారం కోసం అహర్నిశలూ పాటుపడాలని సూచించారు. పురుషుల కంటే స్త్రీలకు నిబద్ధత ఎక్కువ అని, జిల్లా పోలీసు శాఖలో పలు విభాగాల్లో మహిళ పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని, పోలీసు స్టేషన్ లో రిసెప్షన్ విధులు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్, రైటర్ వంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, గృహ హింస మరియు వైవాహిక వివాదాలలో బాధితులైన మహిళలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు అనేక రకాల విధులను మహిళా పోలీసు అధికారులు నిర్వహిస్తున్నారని అభినందించారు. మహిళా అధికారులందరూ పోలీసు శాఖలో భాగమై సమాజానికి చేస్తున్న సేవను పేర్కొంటూ, మహిళలు పలు రంగాలలో సాధిస్తున్న విజయాలు రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, మహిళా అధికారులందరూ ధైర్యంగా ఉండాలని, తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా మహిళా సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పి వేముల శ్రీనివాస్, డిపిఓ ఫర్హాన, భరోసా కోఆర్డినేటర్ మానస, సఖి కోఆర్డినేటర్ గాయత్రి, ఎస్సై శ్రీలత, జిల్లా పరిధిలోని వివిధ విభాగాల మహిళ కానిస్టేబుల్లు పాల్గొన్నారు.
………………………………………..