
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : వ్యాపారులు సిండికేటై పసుపు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ పసుపు రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్(Niajamabad Agricultural Market)లో వ్యాపారులు.. తమను దోపిడీ చేస్తున్నారని సోమవారం ఆందోళన చేపట్టిన రైతులు మంగళవారం కూడా రోడ్డెక్కారు. మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద, ఆ తర్వాత బస్టాండ్ ఎదుట రహదారిపై బైఠాయించి, ధర్నా చేశారు. మార్కెట్కు సోమవారం జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున పసుపును తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకు వ్యాపారులతో పాటు అధికారులు కూడా కొనుగోలు చేపట్టలేదు. రైతులు ఈ విషయమై మార్కెట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం రాత్రి వ్యాపారులు, రైతులతో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ సమావేశమయ్యారు. కొమ్ము రకానికి క్వింటాలుకు రూ.9500కు, మండ రకానికి రూ.8వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి కొనుగోళ్లను మొదలు పెడతామని మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. అయినప్పటికీ మద్దతు ధర కోసం(Support price) రైతు ఐక్యవేది ఆధ్వర్యంలో పసుపు రైతులు మంగళవారం మరోసారి రోడ్డెక్కారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ చేరుకున్నారు. 63వ జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. పసుపునకు క్వింటాలకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎంఐఎస్ పథకం కింద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా పసుపును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్నారు.
……………………………………………………..