
* అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ లాబీలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipalreddy) గులాబీ బాస్ కేసీఆర్ ను కలిశారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే ఫిరాయింపు నేతల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిరాయింపుదారులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎదురుచూస్తున్న తరుణంలో కేసీఆర్(Kcr)ను మహిపాల్ రెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంతకాలానికే ఆయన యూటర్న్ తీసుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్(Congress)లో అనధికారికంగా కొనసాగుతున్నప్పటికీ.. పలు సందర్భాల్లో బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
……………………………………