
* తానే నాయకత్వం వహిస్తానన్న సీఎం రేవంత్
* అసెంబ్లీ బిసి, ఎస్సీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదం
* ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన విపక్ష బీఆర్ఎస్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రిజర్వేషన్ల సాధనాకు తాను నాయకత్వం వహిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలిసి కట్టుగా అందరం ప్రధాని మోదీ వద్దకు వెళ్దామని ఆయన అన్ని పార్టీలకు పిలుపు నిచ్చారు. అసెంబ్లీలో బిసి, ఎస్సీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా సిఎం మాట్లాడారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆయన విజ్జప్తి చేశారు. ఆ క్రమంలో తాము రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సైతం తీసుకుంటామన్నారు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం కలిసి రావాలని కోరుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అసెంబ్లీలో ఆమోదానికి బీసీ రిజర్వేషన్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు ఆమోదం కోసం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 42 శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించి.. ఈ బిల్లు పెట్టామని పేర్కొన్నారు. అలాగే రాజకీయంగానూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకతీతంగా ఐక్యంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1979లోనే ఈ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ వేశారని గుర్తు చేశారు. మండల్ కమిషన్‌తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ శాసనభలో కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు- దేవాదాయ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చింది. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు భారాస సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడే బీసీలు సంతోషిస్తారని అన్నారు. ఈ అంశంపై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానానికి, పార్లమెంట్లో పోరాటానికి భారాస కలిసి వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ ఓటేస్తామని చెప్పారు. బిల్లుపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావాలని హరీశ్‌రావు కోరారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్టసవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ శాసనసభ ముందుకు తీసుకొచ్చారు. వీటితో పాటు- తెలుగు యూనివర్సిటీ-కి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వీటిపై పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం ఈ బిల్లులు సభ ఆమోదం పొందినట్లు- స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
…………………………………..