* ఎట్టకేలకు భూమ్మీదకు సునీతా విలియమ్స్
* స్పేస్ ఎక్స్ క్యాప్యూల్ లో నేటి సాయంత్రం ఫ్లోరిడా తీరానికి..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
సునీతా విలియమ్స్.. భారత సంతతికి చెందిన ఈమె యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, నాసా వ్యోమగామిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి సూచనతో నౌకాదళం లో బేసిక్ డైవింగ్ ఆఫీసర్ గా చేరారు. నేవల్ ఏవియేటర్ గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకున్నారు. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్ లపై 2770 విమాన ( ఫ్లైట్ అవర్స్) గంటల అనుభవం గడించింది.. నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేశారు. 1998లో అంతరిక్షయానంలో శిక్షణ తీసుకున్నారు. కల్పన చావ్లా తరువాత అంతరిక్షం లోకి వెళ్ళిన రెండవ మహిళ ఈమె గుర్తింపు పొందారు. తొలి పర్యటన 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు జరిగింది. రెండోసారి 2012లో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఉన్నారు. ఇదిలాఉండగా.. పది రోజుల ఆపరేషన్ నిమిత్తం మరో నాసా వ్యోమగామి బారీ విల్మోర్ తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన ఈమె అనుకోకుండా అక్కడ నెలల తరబడి చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఆమె, మరో నాసా వ్యోమగామి బారీ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. భూమ్మీదకు అప్పుడొస్తారు.. ఇప్పుడొస్తారు.. అంటూ 9 నెలలుగా ఎన్నో ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్నో వాయిదాలు పడ్డాయి. ఎట్టకేలకు వారు భూమ్మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.
ఆపరేషన్ మొదలైంది ఇలా..
2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్లో భాగంగా సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ రోదసీ యాత్రను చేపట్టారు. ఆపరేషన్ అనంతరం జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే బోయింగ్ కంపెనీ రూపొందించిన CST-100 స్టార్లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26న ఖరారు భూమ్మీదకు వస్తారంటూ నాసా ప్రకటించింది. ఆరోజు కూడా రాలేకపోయారు. సెప్టెంబరు 7న సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది. ఈ వ్యోమనౌకను అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళ్లడానికి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) అనుసంధానించడానికి, మరియు తిరిగి భూమికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. అయితే వ్యోమగాములు లేకుండా వ్యోమనౌక భూమ్మీదకు వచ్చేయడంతో ఆందోళన మొదలైంది.
తిరుగు ప్రయాణం ఇలా..
సునీత, విల్మోర్ ను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక క్రూ డ్రాగన్ గత ఆదివారం విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమైంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం 9.37గంటలకు ఐఎస్ ఎస్తో అనుసంధానమైంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కూడా ఇదే వ్యోమ నౌకలో భూమ్మీదకు రానున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.45 గంటలకు వ్యోమ నౌక క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక అన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత.. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యలను దాటుకుని కిందికి వస్తుంది. సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ) ఫ్లోరిడా తీరానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా ప్రకటించింది.
………………………..
