* సుప్రీం తీర్పును ఇప్పటికీ ఏ రాష్ట్రం అమలు చేయలేదు
* రాహుల్ ఇచ్చిన మాటకు కట్టుబడి రిజర్వేషన్లు ఖరారు చేశాం
* ఎస్సీ సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanthreddy) తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన ఎస్సీ సంఘాల ప్రతినిధులతో సీఎం మాట్లాడారు. ఎస్పీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9 శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు అని వెల్లడించారు. ఎస్సీల్లో ఏ గ్రూపులో ఎవరెవరు ఉండాలనేది విశ్లేషించారు. అతి తక్కువ జనాభా కలిగి.. అభివృద్ధి ఫలాలు ఆశించిన వారిని గ్రూప్ -1లో ఉంచినట్లు వివరించారు. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని 2014లో తెలంగాణ ఏర్పడ్డాక అసెంబ్లీలో చెప్పినట్లు రేవంత్ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి తీర్మానం పంపాలని సావధాన తీర్మానం పెట్టామన్నారు. తీర్మానం పెడితే తనతో పాటు సండ్ర వెంకట వీరయ్య, సంపత్ ను సభలో నుంచి బహిష్కరించారని తెలిపారు. మేం పెట్టిన తీర్మానాన్ని విధిలేని పరిస్థితుల్లో ఆనాడు సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఎస్పీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు బలంగా వినిపించామన్నారు. ఏళ్లుగా వాయిదాపడుతున్న కేసులో బలమైన వాదనలు వినిపించి సుప్రీంకోర్టు మెప్పించామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఇప్పటికీ ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ఈ ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు.
మందకృష్ణతో విభేదాలు లేవ్
మందకృష్ణ(MandaKrishna)తో తనకు ఎలాంటి విభేధాలూ లేవని, వ్యక్తిగత అనుబంధం బాగుందని అన్నారు. కాకపోతే ఆయన తనకంటే కిషన్ రెడ్డి(Kishanreddy), బీజేపీ(Bjp)ని ఎక్కువగా నమ్ముతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనవర్సిటీ వీసీగా తొలిసారి దళితుడిని నియమించినట్లు తెలిపారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్, విద్యా కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలా కీలక శాఖలు అన్నింటిలోనూ ప్రాధాన్య పోస్టుల్లో నియమించామన్నారు. ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని సమాజంలో గౌరవం పెరిగేటట్లు మసులుకోవాలని సూచించారు. ఈ పని ద్వారా పది మందికి సాయం చేసేలా నడుచుకోవాలని తెలిపారు. ఇదొక గొప్ప అవకాశం అని అన్నారు.
…………………………………………..
