* సీఎం రేవంత్‌కు జంపింగ్ ఎమ్మెల్యేల షాక్…
ఆకేరున్యూస్, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. ఇక ఉపఎన్నికలు ఖాయమని కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాల్లో అన్నారు. కాగా.. ఈనెల 4వ తేదీ సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో పాటు ఈనెల 25వ తేదిలోపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, స్పీకర్ కార్యాలయంతో పాటు శాసనసభ కార్యదర్మితో సహా వివరణ ఇవ్వాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదంటూ కీలకవ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరో ప్లాన్ వేశారు. తాము పార్టీ ఫిరాయించలేదని మర్యాదపూర్వకంగా సీఎంను కలిస్తే పార్టీ ఫిరాయించినట్లుగా మీడియాలో రాశానని వాదిస్తున్నారు.
బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు వక్రీకరించారు..
అలా మేము రేవంత్ రెడ్డిని కలవగానే, ఇలా మీడియాలో మేము పార్టీ మారినట్లు, బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు వక్రీకరించారు. ఇందులో మా తప్పులేదంటూ నాలుక మడతపెట్టేశారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు మేల్కొని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. రేవంత్‌ను కలిసిన నాటి నుంచి బిఆర్ఎస్కు దూరంగా ఉంటూ కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్న ఆ పదిమంది ఎమ్మెల్యేలు రూట్ మార్చి అంతా తూచ్ మేము పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు.
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే, అయితే సుప్రీంకోర్టులో మాత్రం పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం, బీఆర్ఎస్ పార్టీతో మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తాజాగా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌తో తెలిపారు. శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యాక, వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మారలేదని, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు సమాచారం.
………………………………..
