
* బెట్టింగ్ యాప్‌ల కట్టడికి సీరియస్ డ్రైవ్
* ఎవ్వరినీ వదలబోమంటున్న పోలీసులు
* విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లకు నటులు, యూట్యూబర్లు
* తాజాగా ప్రముఖ నటులపైనా కేసులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
“ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరూ ప్రమోట్ చేయవద్దు. కాదని చేస్తే తాట తీస్తాం. ఎవ్వరైనా సరే. తగ్గేదేలే” బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, ప్రమోటర్లను ఉద్దేశించి రెండు రోజుల క్రితం పోలీసులు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇది. మాటలతో ఆగలేదు. చేతల్లోనూ చేసి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియా ఇన్స్ఫ్ల్యుఎన్సర్లు, యాంకర్లు, బుల్లితెర నటులపైనే చర్యలకు సిద్ధమైన పోలీసులు తాజాగా ప్రముఖ నటులపైనా కేసులు నమోదు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరు ఎవరిపై ఫిర్యాదు చేసినా ఆధారాలను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు యూట్యూబర్ ఇన్స్ఫ్ల్యుఎన్సర్లు, నటులు దాదాపు 25 మందిపై క్రిమినల్ కేసులు పెట్టిన పోలీసులు తాజాగా ప్రముఖ నటుల ప్రచారంపైనా దృష్టి సారించారు. వీరంతా బెట్టింగ్ యాప్స్ ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపుతున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఆరంభం ఇలా..
బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా సీనియర్ ఐపీఎస్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలుత ఉద్యమం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వీటిని ప్రచారం చేస్తున్న యూట్యూబర్లపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థను, యువత భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండండి. కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయండి’’ అని సజ్జనార్ పిలుపు ఇచ్చారు. ఆయన పిలుపు మేరకు బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయబోమని కొందరు యూట్యూబర్లు ఇప్పటికే ప్రకటనలు చేశారు. పౌరులు కూడా ‘సే నో టూ బెట్టింగ్ యాప్స్’ హ్యాష్ ట్యాగ్‌తో బెట్టింగ్ నివారణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఫలితంగా మోసపూరిత యాప్‌లకు ప్రచారం చేస్తున్న 11 మందిఇన్ఫ్లూయెన్సర్లపై తొలుత ఒకేరోజు పోలీసులు కేసులు నమోదు చేశారు.
పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి యూట్యూబర్లు విష్ణుప్రియ, టేస్టీ తేజను మంగళవారమే విచారణకు పిలిచారు. షూటింగ్లో ఉన్నామంటూ విచారణకు డుమ్మా కొట్టారు. బుధవారం టేస్టీ తేజ విచారణకు హాజరుకాగా, ఈరోజు విష్ణుప్రియ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆర్జే శేఖర్ భాషా కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు వారి స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. యాప్ నిర్వాహకులు ఎవరు. వారు మిమ్మల్ని ఎలా సంప్రదించారు, కాంట్రాక్ట్ ఎలా కుదుర్చుకున్నారు.. వంటి వివరాలను వారిని పోలీసులు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ఇకీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి…. విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, లోకల్‌బాయ్ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శ్యామలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
ప్రముఖ నటులపై కూడా..
తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ నటులపై కూడా కేసులు నమోదయ్యాయి. దగ్గుబాటి రానా (Rana), విజయ్ దేవరకొండ (Vijay devarakonda), ప్రకాశ్‌రాజ్(Prakashraj) పై తదితరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మీ(Manchu Laxmi), నిధి అగర్వాల్ సహా 25 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. కొందరు సినీ నటులు కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా నటి మంచు లక్ష్మి యోలో24/7 యాప్‌ను ప్రమోట్ చేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. బెట్టింగ్ యాప్‌ల కట్టడికి సీరియస్ డ్రైవ్ చేపట్టడంతో తెలుసో, తెలియకో వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు కేసుల చిక్కులు తప్పడం లేదు.
…………………………………