* మన అభిప్రాయ వ్యక్తీకరణ బలం కోల్పోతాం
* సొంత దేశంలోనే అధికారం కోల్పోయిన పౌరులమవుతాం
* డీలిమిటేషన్‌పై చర్చలో తమిళనాడు సీఎం స్టాలిన్
ఆకేరున్యూస్: జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్టాల్రకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ఆరోపించారు. సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్టాల్రకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. ఇందులో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడారు. డీలిమిటేషన్‌పై ఈ అఖిలపక్ష భేటీ చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు. దీన్ని మనమంతా వ్యతిరేకించాలని సూచించారు. పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం పడిపోతే.. అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం తగ్గుతుందని గుర్తించాలని అన్నారు. కేంద్రం నుంచి రాష్టాల్రకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. మన సమ్మతితో సంబంధం లేకుండానే చట్టాలు రూపొందుతాయి. ఆ నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతాయి. విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. రైతులకు మద్దతు కొరవడుతుంది. మన సంప్రదాయాలు, వృద్ధి ప్రమాదంలో పడతాయి. సామాజిక న్యాయం దెబ్బతింటుంది. ఈ పరిణామాలన్నింటితో మన సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని స్టాలిన్ ఈ సందర్భంగా వెల్లడిరచారు. న్యాయబద్ధంగా, పారదర్శంగా డీలిమిటేషన్ చేయాలనే తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కొన్ని దశాబ్దాలుగా పలు దక్షిణాది రాష్టాల్రు కీలక చర్యలు చేపడుతున్నాయని అన్నారు. ఇందుకోసం అనేక విధానాలు కూడా తీసుకొచ్చాం. కానీ, కొన్ని రాష్టాల్ల్రో మాత్రం జనాభా వృద్ధి విపరీతంగా ఉంది. జనాభా నియంత్రణపై మన చర్యలకు ఎలాంటి రివార్డ్ లభించ లేదు సరికదా.. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదంలో పడ్డామని అన్నారు.
………………………………………………….
