
* హైదరాబాద్‌లో ఘటన.. పరారైన బైక్ రైడర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఘర్షణ పడుతున్న ఇద్దరు వ్యక్తులను వారించేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై బీరు బాటిల్‌తో దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్(Hyderabad) బంజారాహిల్స్ లో జరిగింది. టోలిచౌకి నుంచి బంజారాహిల్స్ వైపు బైక్‌పై వస్తున్న వ్యక్తి ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టారు. దాంతో కారులో ఉన్న వ్యక్తికి, బైక్ రైడర్ కు మధ్య వాగ్వాదం తలెత్తింది. అదే సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో డ్యూటీ చేసే కానిస్టేబుల్ శ్రీకాంత్ (Conistable Srikanth)కూడా అదే దారిలో వెళ్తున్నారు. కారు డ్రైవర్, బైక్ రైడర్ మధ్య గొడవ జరుగుతుండటం చూసి వారిని వారించే ప్రయత్నం చేశారు. కానీ ఆ క్రమంలోనే శ్రీకాంత్‌పై బైక్ రైడర్ బీరు బాటిల్ తీసుకుని తలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ శ్రీకాంత్‌కు ఓవైపు తలకు రక్తం కారుతున్నప్పటికీ.. దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. బైక్ నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని ఖాజాగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. పోలీసులు శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
…………………………….