
* అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భూ భారతిపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. భవిష్యత్లో భూ భారతిపైనే ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy) ప్రకటించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూ భారతి కాదని, భూ హారతి అని ఎమ్మెల్యే పల్లా రాజశ్వేర్ రెడ్డి (Palla RajeSwarreddy) విమర్శించారు. భూ భారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే, తాము ధరణిపై ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. జమాబంది పేరుతో మరో దుకాణం తెరిచిందన్నారు. ఇప్పుడు జమాబంది ఎందుకో ప్రభుత్వం చెప్పాలన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)అన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే భూములపై కాంగ్రెస్ హక్కులు కలిగిస్తోందని వెల్లడించారు. దున్నే వాడిదే భూమి అనేది సాయుధ పోరాట నినాదమన్నారు. ఒక్క కలం పోటుతో భూములపై హక్కులు లేకుండా చేసిన చట్టమే ధరణి అని విమర్శించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని, చెప్పినట్లే వేశామని కొత్త చట్టం తెచ్చామని వివరించారు. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన హక్కులను గత ప్రభుత్వంలో కాలరాశారని ఆరోపించారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని అన్నారు.
…………………………